
అసలేం జరిగిందంటే..?
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతన్న నాలుగో టెస్ట్‌కు క్విన్స్ లాండ్ ప్రభుత్వం విధించిన కఠిన క్వారంటైన్‌పై టీమిండియా ముందుగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చివరకు ఇరు దేశాల బోర్డుల పరస్పర అంగీకారంతో భారత జట్టు బ్రిస్బేన్‌లో అడుగుపెట్టింది. అయితే అక్కడి ఏర్పాట్లపై భారత ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన హోటల్లో ఎవరూ లేరని, టాయిలెట్స్ క్లీనింగ్ కూడా తామే చేసుకోవాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తూ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.
|
మేం ఏం చావలేదు కదా..
అయితే ఈ ఫిర్యాదును అవహేళన చేస్తూ స్టార్క్ సతీమణి అలీసా హీలీ ట్వీట్ చేసింది. గతేడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ఇదే హోటల్లో ఉన్నాయని, కఠిన ఆంక్షల మధ్యనే మ్యాచ్‌లు ఆడాయని అలీసా హీలీ గుర్తు చేసింది. అప్పుడు తామేం చావలేదని భారత ఫిర్యాదుపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘గతేడాది ఇదే హోటల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మహిళల జట్లు క్వారంటైన్ పాటించాయి. మేం చావలేదు కదా'అని ట్వీట్ చేసింది.

5 నెలలుగా ఉంటే..
ఇక అలీసా ట్వీట్‌పై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓసోస్ మీకు భారత జట్టుతో పోలికా? ఊరుకోమ్మా.. మీరేమైనా టెస్ట్‌లు ఆడారా? అయినా భారత జట్టు గత 5 నెలలుగా క్వారంటైన్ పాటిస్తుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఒకలా.. భారత ప్లేయర్లకు మరోలా నిబంధనలు ఏంటి? ఈ వివక్ష ఎందుకు? భారత గెలుపు మీరు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం మీ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. పైగా నీ భర్తకు వికెట్ల దక్కడం లేదని భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కుతున్నావ్.. ఇంకోసారి భారత జట్టు గురించి మాట్లాడే ముందు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో'అంటూ భారత అభిమానులు ఘాటుగా ట్రోల్ చేసి పడేసారు.

భారత్ అసాధారణ పోరాటం..
ఇక బోర్డార్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ అద్భుత పోరాటం కనబరుస్తుంది. అడిలైడ్‌లో ఘోర పరాజయం ఎదురైనా.. మెల్బోర్న్ అద్భుత విజయాన్నందుకొని లెక్క సరిచేసింది. ఇక సిడ్నీ మ్యాచ్‌ను అద్వితీయ పోరాటంతో డ్రాగా ముగించింది. ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ధీటుగా బదులిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటవ్వగా.. వాషింగ్టన్ సుందర్(62), శార్దుల్ ఠాకూర్(67) అసాధారణ బ్యాటింగ్‌తో 336 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.