విండీస్ వీరుడు నికోలస్ పూరన్ మరోసారి విజృంభించాడు. ఎదుర్కొన్న నాలుగు బంతుల్లో మూడింటిని సిక్సర్లుగా మలిచాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఉర్రూతలూగారు. ఈ సీన్ అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో కనిపించింది. ఎంఐ న్యూయార్క్ తరఫున ఆడుతున్న పూరన్ బ్యాటుతో చెలరేగాడు.
వాషింగ్టన్ ఫ్రీడంతో జరిగిన మ్యాచులో పూరన్ విశ్వరూపం చూపాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం జట్టు 160 పరుగుల స్కోరు చేసింది. దీన్ని ఛేజ్ చేయడానికి వచ్చిన న్యూయార్క్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. షాయన్ జహంగీర్, మోనాంక్ పటేల్ ఇద్దరు చక్కగా ఆడారు. తొలి వికెట్ 67 పరుగులు జోడించారు.

అనంతరం మూడో స్థానంలోనే క్రీజులోకి వచ్చిన పూరన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మూడు బంతుల్లో ఒక పరుగు చేసి ఉన్న పూరన్.. 9వ ఓవర్ను బౌండరీతో ప్రారంభించాడు. అనంతరం వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 22 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ అయిపోయిన తర్వాత న్యూయార్క్ గెలుపు ఖాయమని అందరికీ అర్థమైపోయింది.
ఇలా పూరన్ చెలరేగిన వీడియోను మేజర్ లీగ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మ్యాచులో పూరన్ కేవలం 33 బంతుల్లోనే 62 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో న్యూయార్క్ జట్టు మరో 21 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించింది.
పూరన్ తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో న్యూయార్క్ విజయం సులభం అయింది. ముఖ్యంగా న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఈ మ్యాచ్ చివర్లో చెలరేగాడు. కేవలం 10 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఈ క్యామియో ఇన్నింగ్స్ కూడా అభిమానులను అలరించింది. గత మ్యాచులో పొలార్డ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైన సంగతి తెలిసిందే.