
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో గెలవడం అసాధ్యం అనుకుంటున్న తరుణంలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ పట్టుదలగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు. వాళ్ల ఆటతీరు చూసిన అభిమానులు వహ్వా అంటూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అశ్విన్ చెలరేగిన తీరుకు ఫిదా అయిపోయారు.
నాలుగో రోజు ఆట మొదలైన కాసేపటికే ఉనద్కత్ కూడా అవుటయ్యాడు. అయితే అక్షర్ పటేల్ కొంత ధాటిగా ఆడాడు. అతనికి జత కలిసిన పంత్ కూడా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను 9 పరుగులకే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అక్షర్, పంత్ ఇద్దరూ అవుటైన తర్వాత అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చారు. వీళ్లిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయ్యర్ (29 నాటౌట్) తనదైన స్టైల్‌లో వేగంగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. చివర్లో గేరు మార్చిన అశ్విన్ (42 నాటౌట్) టీ20 తరహా ఆటతో ఛేజింగ్ పూర్తి చేశాడు.
శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఇలా రాణించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అశ్విన్ తమిళనాడుకు చెందిన వాడే కాగా.. శ్రేయాస్ కుటుంబం మూలాలు కూడా తమిళ కుటుంబానికి చెందినవే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ 'ఇడ్లీ, సాంబార్ ఎప్పుడూ డెడ్లీ కాంబినేషనే.. ఎంతటి వాళ్లనైనా దాసోహం అనిపిస్తుంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీలు కూడా అశ్విన్ ఇన్నింగ్స్‌ను తెగ మెచ్చుకున్నారు. 'ఈ సైంటిస్టు మళ్లీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు'. అయ్యర్, అశ్విన్ ఇద్దరూ కలిసి చివరి వికెట్‌కు 71 పరుగులు జోడించి జట్టుకు విజయం అందించిన సంగతి తెలిసిందే.