
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పిచ్చి పట్టినట్లుంది. క్రికెట్ అభిమానులంతా ఇదే మాట అంటున్నారు. దీనికి కారణం, ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకులు. తాజాగా అన్ని ఫార్మాట్లలో ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ.. టెస్టు ఫార్మాట్లో నెంబర్ వన్ జట్టుగా భారత్‌ను ప్రకటించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ చాలా సంతోషించారు. ఏకకాలంలో అన్ని ఫార్మాట్లలో జట్టును నిలిపిన నాయకుడు అంటూ రోహిత్ శర్మను తెగ మెచ్చుకున్నారు. అయితే సడెన్‌గా ఏమైందో కొన్ని గంటల తర్వాత భారత ర్యాంకు పడిపోయింది.
ఈ గంటల వ్యవధిలో ఎలాంటి టెస్టు మ్యాచులు జరగలేదు. వాటి ప్రభావం కూడా ఈ ర్యాంకులపై పడలేదు. కానీ భారత్ తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆ స్థానాన్ని మళ్లీ ఆస్ట్రేలియానే ఆక్రమించింది. ఇది చూసిన ఫ్యాన్స్ మండి పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కూడా ఐసీసీ ఇలాగే చేసింది. సడెన్‌గా భారత్‌ను నెంబర్ వన్ టెస్టు టీంగా ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆస్ట్రేలియాను నెంబర్ వన్ జట్టుగా పేర్కొంది. ఇలా వెంట వెంటనే జట్టు ర్యాంకులు మార్చడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు.
ఐసీసీకి ఏమైనా పిచ్చి పట్టిందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం టీ20, వన్డేల్లో నెంబర్ వన్ జట్టుగా ఉన్న భారత జట్టు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలిస్తే టెస్టుల్లో కూడా అగ్రస్థానం సాధించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ మాత్రమే అయింది. దీనిలో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడినా కూడా.. ఈ ప్రభావం ఐసీసీ ర్యాంకుపై అంతగా పడలేదు. అయితే తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ అశ్విన్ అదరగొట్టాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అతను.. టెస్టు బౌలర్ల జాబితాలో కూడా రెండో ర్యాంకుకు చేరుకున్నాడు.