టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల వీరుడు కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దాయాది పాకిస్థాన్‌లోనూ అతడికి అభిమానులు ఉన్నారు. అక్కడి యువ క్రికెటర్లు కూడా కోహ్లీని ఆరాదిస్తుంటారు. అతడి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయం నిరూపితమైంది. పాకిస్థాన్ లో విరాట్ అంటే అక్కడి యువతలో ఏ రేంజ్ లో అభిమానం ఉంటుందో తెలిసేలా ఓ వీడియో బయటకు వచ్చి తెగ చక్కర్లు కొడుతోంది. అందులో వందలాది మంది పాకిస్థానీ ఫ్యాన్స్ గుమిగూడి... విరాట్ కోహ్లీ జిందాబాద్ అంటూ ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక దగ్గర హోరెత్తించారు!
నాలుగు రోజుల్లో ప్రారంభం..
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మొదలు కానుంది. దీంతో ఈ మెగా ట్రోఫీ కోసం ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ లోని మూడు వేదికల్లో (టీమిండియా మ్యాచులు మినహా) నిర్వహించనున్నారు. లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికగా మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ స్టేడియాల రెనోవేషన్ పనులు కూడా దాదాపుగా అయిపోయాయి. కరాచీ స్టేడియంలో ట్రై సరీస్ ను కూడా నిర్వహించారు.

కోహ్లీ.. కోహ్లీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ..
అయితే తాజాగా కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెరమనీ నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ తరలివచ్చారు. స్టేడియం గేట్లు దూకి మరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడి వచ్చిన వారిలో కోహ్లీ పాకిస్థానీ ఫ్యాన్స్ కూడా ఉన్నారని తెలుస్తోంది. అక్కడి వచ్చిన కొంతమంది యువత పాకిస్థాన్ లీగ్ లోని ఫ్రాంఛైజీలు, పాక్ క్రికెటర్ల పేర్లు కాకుండా.. కోహ్లీ నామస్మరణతో హోరెత్తించారు. ఐపీఎల్ లో విరాట్ ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టు ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ రచ్చ లేపారు. కోహ్లీ.. కోహ్లీ.. విరాట్ కోహ్లీ జిందాబాద్.. అని తమ అభిమాని చాటుకున్నారు.
ఈ క్రమంలోనే 'మీరు బాబర్ కోసం వచ్చారా.. కోహ్లీ కోసం వచ్చారా' అని అడగగా.. పలువురు అభిమానులు విరాట్ కోహ్లీ అనగా.. మరి కొంతమంది బాబర్ అని చెప్పుకొచ్చారు. గుంపులో నుంచి ఓ వ్యక్తి మాత్రం బయటకు వచ్చి.. "నా పేరు కరణ్.. నన్ను అందరూ కోహ్లీ అంటారు. విరాట్ కు నేను పెద్ద అభిమానిని. విరాట్ కోహ్లీ జిందాబాద్" అంటూ తన అభిమానాన్ని వ్యక్త పరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.