
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కోహ్లీ ఏం చేసినా దాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూనే ఉంటారీ అభిమానులు. అదే విషయం మరోసారి ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో రుజువైంది. మూడో రోజు ఆటలో అద్భుతంగా పోరాడిన కోహ్లీ.. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడా తడబడకుండా అనవసరమైన షాట్లు ఆడకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో 29వ టెస్టు హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
అయితే కోహ్లీ తన అర్ధశతకం పూర్తి చేసుకునే సమయంలో.. రెండు పరుగులు తీశాడు. అతను చాలా వేగంగా ఈ రెండు రన్స్ పూర్తి చేశాడు. అయితే ఈ డబుల్ రన్ పూర్తి చేయగానే అతను హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న అంపైర్ ఈ రెండు రన్స్ పూర్తయ్యాయా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ అంపైర్ ఎవరో కాదు నితిన్ మీనన్. కోహ్లీ విషయంలో ఎప్పుడూ నెగిటివ్ నిర్ణయాలు ఇవ్వడం నితిన్‌కు బాగా అలవాటు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచులో కూడా బంతి కోహ్లీ బ్యాటు, ప్యాడు రెంటికీ ఒకేసారి తగిలినా అవుట్ ఇచ్చింది అతనే.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీకి అవసరమైన రెండు పరుగులు చేయలేదని, షార్ట్ రన్ తీశాడేమో చెక్ చేయాలని నితిన్ సూచించాడు. దీంతో కోహ్లీ తన హాఫ్ సెంచరీ సెలబ్రేట్ చేసుకోలేదు. రిప్లేలో కోహ్లీ బ్యాటు క్రీజును దాటినట్లు కనిపించడంతో అతనికి రెండు పరుగులు ఇచ్చారు. దీంతో కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా పూర్తయింది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట తెగ జోకులు పేలుస్తున్నారు.
కోహ్లీ ఏ చిన్న పొరపాటైనా ఎప్పుడు చేస్తాడా? అని నితిన్ మీనన్ భూతద్దంలో చూస్తుంటాడని, మెషీన్‌లా మారిపోతాడని అంటున్నారు. మరికొందరేమో వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఇప్పుడప్పుడే ముగియదని కామెంట్స్ చేస్తున్నారు. తమకు నితిన్ మీనన్ అస్సలు నచ్చడని కొందరు ఫ్యాన్స్ తిడుతున్నారు.