
హైదరాబాద్: భారత మహిళ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తన ఫేవరేట్ క్రికెటర్‌ను కలిసింది. కియా సూపర్ లీగ్‌లో భాగంగా స్మృతి మంధాన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. ఈ టోర్నీలో భాగంగా వెస్టర్న్ స్టార్మ్ జట్టుకు ఆడుతున్న మంధాన ఆదివారం తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించింది.
మ్యాచ్ అనంతరం తన ఫేవరెట్ క్రికెటర్ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరను కలిసింది. గతంలో అనేకసార్లు మంధాన తన రోల్ మోడల్ కుమార సంగక్కరే అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని నేరుగా కలిసే అవకాశం రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.
సంగక్కరతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసింది. "నా కల నిజమైంది. ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను.. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం ఇది" అని ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసింది.
మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన బ్యాట్స్ ఉమెన్‌గా చరిత్ర సృష్టించింది. మందాన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. తనదైన శైలిలో సిక్స్‌తో మంధాన హాఫ్ సెంచరీని పూర్తి చేసింది. దీంతో సోఫీ డివైన్(న్యూజిలాండ్)తో కలిసి మంధాన సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
అదే సమయంలో స్మృతి మంధాన ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను గ్రౌండ్‌లో ప్రత్యక్షంగా చూసిన సంగక్కర.. తన ట్విటర్ అకౌంట్‌లో మందానపై పొగడ్తలు కురిపించాడు.