Nicholas pooran: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో.. గుజరాత్ టైటాన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఛేదనలో నికోలస్ పూరన్ (34 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్స్‌లతో సాయంతో 61 పరుగులు), మార్‌క్రమ్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 58 పరుగులు) చెలరేగి ఆడారు. దీంతో లక్నో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచి హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ మ్యాచులో పూరన్ బాదిన సిక్స్ దెబ్బకు ఓ ఫ్యాన్స్ తల పగలింది.
అస్సలు తగ్గలేదు..
ఈ మ్యాచులో రిషభ్ పంత్ ఔటయ్యాక వన్ డన్‌లో వచ్చిన... నికోలస్ పూరన్ యమా బాదుడు బాదాడు. ఈ సీజన్లో ఇప్పటికే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతోన్న అతడు.. తాజా మ్యాచులోనూ మరోసారి సిక్సర్లతో చెలరేగే ప్రదర్శన చేశాడు. మొదట రషీద్ బౌలింగ్‌లోని సిక్స్‌తో ప్రారంభమైన అతడి జోరు.. మ్యాచు మొత్తంగా కొనసాగుతూనే ఉంది. ఓ దశలో తారాస్థాయికి చేరింది. సాయి కిశోర్ వేసిన ఓవర్లో ఏకంగా మూడు సిక్స్‌లు, ఫోర్ కూడా బాదాడు. ఆ ఓవర్ లో 24 పరుగులు రాబట్టాడు. మార్‌క్రమ్ ఔట్ అయినా.. పూరన్ అస్సలు తగ్గలేదు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అలా అతడు మ్యాచు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.

పూరన్ సిక్స్ దెబ్బకు ప్రేక్షకుడు అబ్బ..
అయితే నికోలస్ పూరన్ బాదిన ఇన్నింగ్స్ లో మొత్తంగా ఓ బౌండరీ, ఏడు సిక్సులు ఉన్నాయి. అయితే అతడు బాదిన ఓ సిక్స్ స్టాండ్స్ లో కూర్చున్న ఓ అభిమానికి తలకు గట్టిగా తగిలి గాయమైంది. రక్తం కూడా తీవ్రంగా కారింది. వెంటనే అక్కడి వైద్య సిబ్బంది.. అతడికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజీ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కానీ ఆ తర్వాత ఫ్యాన్.. క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. తలకు కట్టు కట్టించుకుని మరీ.. మ్యాచ్ పూర్తయ్యేవరకు చూసి మరీ వెళ్లాడు. సిబ్బంది అతడికి నచ్చజెప్పి పంపించేందుకు ప్రయత్నించినా వెళ్లలేదని తెలిసింది. దీంతో ఇతర క్రికెట్ అభిమానులు అతడిని ప్రశంసిస్తున్నారు.
ఆరు ఇన్నింగ్స్ లో 349 పరుగులు..
మొత్తంగా ఈ సీజన్ లో పూరన్.. తన నిలకడ, పవర్ హిట్టింగ్ ఆటతో అదరగొడుతున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు 31 సిక్సులు బాదాడు. ఆరు ఇన్నింగ్స్ లో 215.43 స్ట్రైక్ రేటుతో 349 పరుగులు చేశాడు. ఇతడి తర్వాత గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ 273 పరుగులు చేశాడు. ఇతర ఏ బ్యాటర్ కూడా 300 పరుగుల మార్క్ ను దాటలేదు.