
కరాచీ: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్ 2-0తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 298 పరుగుల లక్ష్యాన్ని పాక్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఫకర్ జమాన్ (76), అబిద్ అలీ (74), హారిస్ సోహైల్ (56) అర్ధ సెంచరీలతో రాణించారు. ప్రదీప్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 297 భారీ స్కోరు చేసింది. ఓపెనర్ గుణతిలక (133), షణక (43), తిరిమన్నె (36), భానుక (36) రాణించారు. ఆమిర్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఈ విజయంతో పాక్ 2-0తో కైవసం చేసుకుంది. కరాచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ సూపర్ సెంచరీ (111) చేయడంతో పాక్ 67 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలి వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రైద్దెన విషయం తెలిసిందే. రెండో వన్డేకు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉండటంతో ముందు జాగ్రత్తగా మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఆదివారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ సోమవారం (సెప్టెంబర్ 30) జరిగింది.
రెండో వన్డే మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ రికార్డు సృష్టించాడు. సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. బాబర్ ఆజమ్ వన్డేల్లో అత్యంత వేగంగా 11 సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 71 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. అంతకు ముందు కోహ్లీ 82 ఇన్నింగ్స్‌ల్లో 11 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అషీమ్ ఆమ్లా 64 ఇన్నింగ్స్‌ల్లో, డికాక్ 65 ఇన్నింగ్స్‌ల్లోనే 11 సెంచరీలు సాధించారు.
2009 జనవరిలో పాక్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో పాక్ ఆటగాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన తర్వాత పాక్‌లో పర్యటించేందుకు ఏ దేశం ముందుకు రాలేదు. దీంతో చేసేదేంలేక దుబాయ్ వేదికగా పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీసులు ఆడుతూ వస్తోంది. అయితే తమ దేశంలో క్రికెట్ ఆటకు పూర్వవైభవం తీసుకురావాలని పాక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సుదీర్ఘ చర్చల తర్వాత శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటిస్తోంది.