కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమ జట్టు విజయం సాధించడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ హర్షం వ్యక్తం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 14 పరుగులతో గెలుపొంది క్వాలిఫయర్-2కు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం మాట్లాడిన ఫాఫ్ డుప్లెసిస్.. సంతోషం వ్యక్తం చేశాడు. ఈ గెలుపుతో గాల్లో తేలినట్టుందని తెలిపాడు. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు. సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన తమ యువ ప్లేయర్ రజత్ పటీదార్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
ఈ టోర్నీలో తాను చూసిన అతి గొప్ప శతకాల్లో ఇదొకటని కొనియాడాడు.
'మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ విజయంతో గాల్లో తేలినట్టుంది. రజత్ పటీదార్ లాంటి యువ ఆటగాడు ఇలా రాణించడం జట్టుకు శుభపరిణామం. అతను సెంచరీ సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే ఎలాంటి బాధ్యత తన భుజాలపై మోసాడో అర్థమవుతుంది. ఈ టోర్నీల్లో నేను చూసిన అతి గొప్ప శతకాల్లో ఇదొకటి. స్టేడియం నలువైపులా షాట్లు కొట్టాడు. అతను దూకుడుగా ఆడిన ప్రతిసారీ ప్రత్యర్థులపై ఒత్తిడి తెస్తాడు. రెండో ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు చాలా ప్రశాంతంగా ఉన్నారు.
వారికి ఎలా బౌలింగ్ చేయలనే విషయంపై స్పష్టత ఉంది. దీన్ని మేం ఓ సాధారణ మ్యాచ్‌లా భావించాం. హర్షల్ పటేల్ మా జట్టులో ప్రత్యేకమైన బౌలర్. అతను డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను దెబ్బతీశాడు. అతను వేసిన 18వ ఓవర్లోనే ఈ మ్యాచ్ మలుపు తిరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద విజయం సాధించినా సరే ఈ విజయం మాత్రం ప్రత్యేకం. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం' అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79), దీపక్ హుడా(26 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 19వ ఓవర్లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి హజెల్ వుడ్ మ్యాచ్ మూమెంటమ్ మార్చేసాడు.