
హైదరాబాద్: తొలి వన్డేలో మరో 60, 70 పరుగులు చేసి ఉంటే ఫలితం మాకు అనుకూలంగా ఉండేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అన్నాడు. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై కోహ్లీసేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో సొంతగడ్డపై వరుసగా 17 విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా బ్రేక్ వేసినట్లైంది. దీంతో మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మీడియాతో మాట్లాడుతూ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమవ్వడంతోనే భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలయ్యామని అన్నాడు.
'ఈ రోజు మేము సరిగా బ్యాటింగ్ చేయలేదు. మా జట్టులో బ్యాట్స్‌మెన్ సాధించిన రెండో అత్యుత్తమ స్కోరు 37. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. వన్డేల్లో విజయం సాధించాలంటే ఏ ఇద్దరి బ్యాట్స్‌మెన్ల మధ్య అయినా మంచి భాగస్వామ్యం నమోదు అవ్వాలి' అని తెలిపాడు.
'భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారికే ఐదు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మా జట్టు 300 స్కోరు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ పిచ్‌పై 269 పరుగులు సరిపోలేదు. ఈ స్టేడియంలో గత రెండు మ్యాచుల్లో మేమే విజయం సాధించాం' అని డుప్లెసిస్ వివరించాడు.
'ఆస్ట్రేలియాపై 370 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించాం. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్యలో అనవసరంగా వికెట్లు పోగొట్టుకున్నాం. మరో 60, 70 పరుగులు చేసి ఉంటే ఫలితం మాకు అనుకూలంగా ఉండేది' అని డుప్లెసిస్ అన్నాడు. వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా ఈ మ్యాచ్‌పై తన ప్రభావాన్ని చూపలేకపోయాడు.
ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన ఇమ్రాన్ తాహిర్ 51 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 'సాధారణంగా తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ పరుగులు చేస్తే, ప్రత్యర్ధి జట్టుపై ఒత్తిడి ఉంటుంది. ఓవర్‌కు 5 పరుగులు ఛేజ్ చేయడం చాలా సులభం. తొలి 10 ఓవర్లలో మూడు లేదా నాలుగు వికెట్లు తీసినట్లైతే ప్రత్యర్ధి జట్టుపై ఒత్తిడి ఉండేది' అని డుప్లెసిస్ అన్నాడు.
తొలి వన్డేలో విజయం సాధించడంతో ఆరు వన్డేల సిరిస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం (ఫిబ్రవరి 4)న సెంచూరియన్ వేదికగా జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.