అడిలైడ్: బాల్ టాంపరింగ్ వివాదంలో ఐసీసీ ఆర్టికల్ 2.2.9 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్‌పై చర్యలను తీసుకుంది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియో పుటేజీలో తేలడంతో అతడికి మొత్తం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
రెండో టెస్టులో పాల్గొన్న అంఫైర్లు సాక్ష్యాలు, మార్లేబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) క్రికెట్ జాన్ స్టీఫెన్సన్ హెడ్ ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ బాల్ టాంపరింగ్ వివాదంలో డుప్లెసిస్‌ను దోషిగా తేల్చింది. అయితే అడిలైడ్‌లో జరిగే మూడో టెస్టులో ఆడేందుకు మాత్రం డు ప్లెసిస్‌కు క్లియరెన్స్ ఇచ్చింది.

డు ప్లెసిస్ తన లాలాజలంతో బంతిని రుద్దుడమే కాకుండా, నోటిలో ఉన్న మింట్ (తెల్లటి పదార్ధం)ను కూడా ఉపయోగించినట్లు ఐసీసీ తన నివేదికలో పేర్కొంది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని 2.2.9 నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. దీంతో అతనికి వార్నింగ్ ఇచ్చి జరిమానాను విధిస్తున్నట్లు ఐసీసీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ సన్ పేర్కొన్నారు.
కావాలని చేయకపోయినా అతడు ఐసీసీ కోడ్ నియమావళిని ఉల్లఘించినట్లేనని అవుతుందని పేర్కొన్నాడు. దీంతో డుప్లెసిస్‌పై మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినప్పటికీ చివరకు 100 శాతం మ్యాచ్ జరిమానాను విధించడం విశేషం.
గతంలో 2013లోనూ పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డుప్లెస్సి ఇలాగే బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా 2-0తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.