హైదరాబాద్: ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యధిక జీతం అందుకున్న ఆటగాళ్లుగా లియోనల్ మెస్సీ, స్టీఫెన్ కర్రీ, జేమ్స్ హార్డిన్‌లు ఉన్నారు. సాధారణంగా అంతర్జాతీయ క్రీడాకారులతో పోలిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జీతం చూస్తే ఇంత తక్కువా? అని అనిపిస్తుంది.
ప్రతి ఏడాది ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జీతంగా వచ్చే డబ్బు కంటే కూడా ప్రకటనల ద్వారానే మన క్రీడాకారులు పెద్ద మొత్తంలో సంపాదిస్తుంటారు. కోహ్లీ కూడా ప్రకటనల ద్వారానే పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకునే 100 మంది క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ 89వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పత్రిక ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 69 మంది అమెరికా మేజర్ లీగ్ బేస్‌బాల్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లకు చెందిన వారే కావడం విశేషం.
నిజానికి జట్టు పరంగా ఆయా క్రీడాకారులు అందుకుంటున్న పారితోషకం తక్కువగానే ఉండొచ్చు, కానీ ఎండార్స్‌మెంట్స్, ఇతర వాటి ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో ఉంటుంది. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కి పారితోషికం కంటే ప్రకటనల సంపాదనే ఎక్కువ.
ఇక గోల్ఫర్ టైగర్ ఉడ్స్, స్ప్రింటర్ ఉసైన్ బోల్ట్‌ల పరిస్థితి కూడా అంతే. పారితోషికం పరంగా ఉసైన్ బోల్ట్, టైగర్ ఉడ్స్‌ల కన్నా విరాట్ కోహ్లీ మెరుగే అయినా, సంపాదన విషయంలో మాత్రం వారితో పోటీ పడలేకపోతున్నాడు. మూడు మిలియన్ డాలర్ల పారితోషికం, 19 మిలియన్ డాలర్ల ప్రకటనల ఆదాయంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు విరాట్ కొహ్లీనే.
ఈ ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసిన 'ది వరల్డ్స్ హైయస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్-2017' జాబితాలో పుట్ బాల్ ప్లేయర్ 93 మిలియన్ డాలర్లతో క్రిస్టియానో రోనాల్డో (పోర్చుగీస్) అగ్రస్థానంలో నిలిచారు.