
లీడ్స్: వెస్టిండీస్ యంగ్ క్రికెటర్ ఫాబియన్ అలెన్.. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తన జట్టు ఎదుర్కొన్న చిట్టచివరి మ్యాచ్‌లో అద్భత ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లే కార్నేజ్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ విండీస్ స్పిన్ బౌలర్.. గాల్లో ఎగురుతూ అందుకున్న క్యాచ్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ చివరికంటా పోరాడింది. అయినప్పటికీ.. లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 50 ఓవర్లలో 288 పరుగులు చేసి, ఆలౌట్ అయింది.
వెస్టిండీస్ ఇన్నింగ్ చివరి ఓవర్‌ను ఒషానె థామస్ సంధించాడు. చిట్టచివరి బంతి ఎదుర్కొన్న ఆఫ్ఘన్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సయ్యద్ షిర్జాద్.. ఎక్స్‌ట్రా కవర్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి గాల్లోకి లేచింది. ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న ఫాబియన్ అలెన్.. సుమారు 20 మీటర్ల దూరం పాటు వెనక్కి పరుగెత్తాడు. బంతికి నేలకు ఆనుతుందనుకుంటున్న సమయంలో.. గాల్లోకి ఎగిరాడు ఫాబియన్. సుమారు నాలుగు అడుగుల ఎత్తు వరకూ గాల్లోకి ఎగిరి ఆ బంతిని అందుకున్నాడు. చిట్టచివరి బంతికి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఆ క్యాచ్ ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. దీనిపై నెటిజన్లు, ట్విట్టరెట్టీలు ఫాబియన్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఫ్లయింగ్ ఫాబియన్ ఆని పేరెట్టేశారు.
ఇలా గాల్లో ఎగురుతూ క్యాచ్‌ను అందుకోవడం ఫాబియన్‌కు ఇది రెండోసారి. ఇంతకుముందు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ అతను అందుకున్న రిటర్న్ క్యాచ్ కూడా ఇలాంటిదే. ఇన్నింగ్ నాలుగో ఓవర్‌లో ఫాబియన్ వేసిన బంతిని లాంగ్ ఆన్ వైపు ఆడటానికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ ప్రయత్నించగా.. అది గాల్లోకి లేచింది. నాన్ స్ట్రైకర్ వైపు దూసుకెళ్తున్న ఆ బంతిని కుడి వైపునకు డైవ్ చేస్తూ ఫాబియన్ అందుకున్న తీరు అద్భుతహ అనిపించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచీ వెస్టిండీస్ నిష్క్రమించింది.