కొత్త తరహా ఫిట్‌నెస్ టెస్టు: అందరి కళ్లు 36 ఏళ్ల ధోనిపైనే!

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ముగియడంతో ఇప్పుడు అందరి కళ్లు అంతర్జాతీయ క్రికెట్ వైపుకి మళ్లాయి. యూరప్ పర్యటనకు బయల్దేరడానికి ముందు టీమిండియా స్వదేశంలో ఆప్ఘనిస్థాన్ జట్టుతో చారిత్రాత్మక టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టుకి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
అయితే, టీమిండియా తరుఫున ఆడాలంటే ప్రతి ఒక్క క్రికెటర్ తప్పకుండా ఫిట్‌నెస్ టెస్టు పాసవ్వాలి. లేదంలే అతడికి చోటు దక్కడం కష్టమే. గతేడాది యువీ, రైనా యో-యో టెస్టు విఫలమవ్వడంతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు మరో ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఆప్ఘన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్
ఆప్ఘన్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌తో పాటు ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్ వేదికగా జరిగే మ్యాచ్‌ల కోసం సెలక్టర్లు ఇప్పటికే భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరితో పాటు ఇంగ్లాండ్ లయన్స్, వెస్టిండిస్-ఏ జట్లతో ఆడే ఇండియా-ఏ జట్లను కూడా సెలక్టర్లు ప్రకటించారు.

ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకానున్న క్రికెటర్లు
ఈ పర్యటనలకు ఎంపికైన ఆటగాళ్లందరూ బెంగళూరులోని జాతీయ క్రికెటర్ అకాడమీలో జూన్ 5 నుంచి 10లోపు నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నారు. అయితే, ఈ ఆటగాళ్ల అందరికీ గతంలో నిర్వహించే యో-యో ఫిట్‌నెట్ టెస్టు కాకుండా కొత్తగా మరో ఫిట్‌నెస్ టెస్టుని నిర్వహించనున్నారు.

అసలేంటీ ఈ 'DEXA scan'
ఈ కొత్త ఫిట్‌నెస్ పరీక్ష పేరు 'DEXA scan'. 10 నిమిషాల పాటు ఉండే ఈ స్కాన్ ద్వారా ఆటగాడి ఎముకల సామర్థ్యం, ఎనర్జీ లెవల్స్, కొవ్వు నిల్వలను పసిగట్టొచ్చు. వచ్చిన రిపోర్టు ఆధారంగా ఆయా క్రికెటర్ చేయాల్సిన కసరత్తులపై ఫిజియోలు, వైద్యులు దృష్టిపెడతారు.

యో-యో టెస్టుతో పాటు ఇది టెస్టు కూడా
ఇకపై భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టుతో పాటు ప్రతి ఆటగాడికి ఈ టెస్టు నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్స్‌ను పెంచేందుకే ఈ కొత్త టెస్టును తీసుకువస్తున్నట్లు బీసీసీఐ సిబ్బంది తెలిపారు.

అందరి కళ్లు 36 ఏళ్ల ధోనిపైనే
కొత్త ఫిట్‌నెస్ టెస్టు నేపథ్యంలో అందరి కళ్లు 36 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోనిపై నెలకొన్నాయి. యో-యో టెస్టు పాసైన ధోని ఈ టెస్టులో ఎలా నెట్టుకొస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications