హైదరాబాద్: సెప్టెంబర్ 8 (శుక్రవారం) న్యూఢిల్లీలో జరిగిన స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల కార్యక్రమానికి ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో పాటు పారా ఒలింపిక్ షాట్ పుట్టర్ దిపా మాలిక్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను విరాట్ కోహ్లీ ఫౌండేషన్ (వీకేఎఫ్) పేరిట స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నామని కోహ్లీ తెలిపాడు. ప్రతి ఏడాది రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కోహ్లీ తెలిపాడు.

అయితే అథ్లెట్ల ప్రదర్శన బట్టి ఈ మొత్తం పెరుగుగుతుందని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. క్రికెట్ లేకుండా తానేమీ చేయలేనని, క్రికెట్ ద్వారానే తాను ఈస్థాయికి వచ్చానని కోహ్లీ తెలిపాడు. ఇందుకోసం ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూపుతో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ (వీకేఎఫ్) చేతులు కలిపింది.
అదే సమయంలో తాను కుర్రాడిగా ఉన్నప్పుడు జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఆల్ ఇంగ్లండ్‌లో గెలువడం తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని కూడా కోహ్లీ అన్నాడు. 'గోపీ సర్ ఆల్ ఇంగ్లండ్ మ్యాచ్‌ను నా స్నేహితులతో కలిసి చూశా. అది ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో నా స్నేహితుల్లో చాలా మంది రాష్ట్రస్థాయి టోర్నీల్లో ఆడేవారు. గోపీ సాధించిన ఘనతలను చూసి గర్వపడుతున్నాం. సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేయడం మామూలు విషయం కాదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై గోపీచంద్ వన్‌ఇండియా తెలుగుతో మాట్లాడుతూ 'నిజంగా ఇది నమ్మలేకపోతున్నా. తన స్నేహితులతో కలిసి నా ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ మ్యాచ్‌ని కోహ్లీ చూశానని చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. మన దేశంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడికి కోహ్లీ ఆదర్శంగా నిలుస్తున్నాడు' అని అన్నాడు.
'స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో కోహ్లీ ఏదైతే మాట్లాడాడతో అది నా అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరినీ వినమని చెప్పా. నిజంగా అలాంటి స్పీచ్ విద్యార్ధులకు ఎంతో ప్రేరణ కలిగిస్తుంది' అని గోపీచంద్ పేర్కొన్నాడు.
ఇక సైనా తిరిగి తన అకాడమీలో శిక్షణ తీసుకోవడంపై కూడా గోపిచంద్ స్పందించాడు. వరుసగా పదేళ్ల పాటు సైనాకు తాను ట్రైనింగ్ ఇచ్చానని, ఆమె తనకు కొత్త ఏమీ కాదని చెప్పుకొచ్చాడు. కోర్టులో ఆమె తిరిగి పూర్వవైభవం తిరిగి కొనసాగించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పాడు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ మధ్య పోలికలు తీసుకురావొద్ద గోపీచంద్ సూచించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పతకాలు గెలవడం, సైనా నెహ్వాల్ తన అకాడమీకి తిరిగి రావడంపై తాజాగా గోపీచంద్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'నేను సైనా నెహ్వాల్‌కి 2004 నుంచి 2014 వరకు కోచింగ్ ఇచ్చాను. సబ్ జూనియర్ లెవల్ నుంచే సైనా చాలా టోర్నీమెంట్లలో గెలుపొందింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారత బ్యాడ్మింటన్‌లో తనదైన ముద్ర వేయగలిగింది' అని అన్నాడు.
'తానే.. యువ క్రీడాకారులైన పీవీ సింధు, కశ్యప్, గురుసాయి దత్, అజయ్ జయరాం, ప్రణయ్, ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ తదితరులకి స్ఫూర్తి' అని గోపీచంద్ వివరించాడు. కొంతమంది సైనా నెహ్వాల్, పీవీ సింధు మధ్య పోలిక తేవడంపై గోపీచంద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఆ ఇద్దరినీ పోల్చడం సమంజసం కాదు. సైనా 2006-2007లోనే కెరీర్ ఆరంభించింది. పీవీ సింధు తనకంటే చాలా చిన్నది. అయితే.. ఇద్దరూ శారీరకంగా మంచి ఫిటెనెస్ ఉన్న క్రీడాకారుణులే. చివరి వరకూ పోరాడుతారే తప్ప అంత సులభంగా ఓటమిని ఒప్పుకోరు. ప్రస్తుతం ఇద్దరూ తమ టార్గెట్స్‌పై దృష్టి పెట్టారు' అని గోపీచంద్ తెలిపాడు.