రియో డి జెనిరో: జమైకా చిరుత ఉసెన్ బోల్ట్ పరుగును చూసేందుకు తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని భారత క్రికెట్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. రియో ఒలింపిక్స్ నాలుగు రోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అందరి చూపు రియో పైనే ఉంది.
ఒలింపిక్స్: నిరాశపరిచిన బింద్రా, 3 సెకండ్ల ముందు హాకీ..
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కరేబియన్ గడ్డ పైన ఉంది. మన భారత క్రికెటర్లు కూడా రియోపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఆగస్టు 14వ తేదీన ఉసెన్ బోల్ట్ పరుగు కోసం వారు నిరీక్షిస్తున్నారు. ఇదే విషయాన్ని కోహ్లీ చెప్పాడు.

ప్లానెట్‌లోనే ఫాస్టెస్ట్ మ్యాన్ పరుగును చూసేందుకు తాను, తమ జట్టు ఎదురు చూస్తోందని కోహ్లీ అన్నాడు. రియోలో వంద మీటర్ల గేమ్ షెడ్యూల్ ఆదివారం నాడు రాత్రి గం.10.25 నిమిషాలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఉంది.
కాగా, ఉసెన్ బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్లు, 4X100 మీటర్ల పరుగులో పాల్గొంటున్నాడు. ఈ మూడింటి పైన అతను కన్నేశాడు. అంతేకాదు, 200 మీటర్లులో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దీనిపై బోల్ట్ మాట్లాడుతూ... ఇవి నా చివరి ఒలింపిక్స్ అని చెప్పాడు. నన్ను నేను నిరూపించుకున్నానని చెప్పాడు.

200 మీటర్ల ప్రపంచ రికార్డును (19.19 సెకండ్లు) బద్ధలు కొట్టాలని బోల్ట్ భావిస్తున్నాడు. దాని కోసమే తాను ఎదురు చూస్తున్నానని అభిప్రాయపడ్డాడు. 200 మీటర్ల రికార్డును 19 సెకండ్లలో పూర్తి చేయాలని అతను భావిస్తున్నాడు.