హైదరాబాద్: క్రికెట్‌లో తన వివాదాస్పద నిర్ణయాలతో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా మాజీ టెస్టు అంఫైర్ డారెల్ హెయిర్ మళ్లీ ఇన్నాళ్లకు ఓ దొంగతనం కేసులో దొరికి వార్తల్లో నిలిచాడు. తాను పనిచేస్తున్న లిక్కర్ షాప్‌లోనే డబ్బు దొంగిలించాడంటూ హెయిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం దొంగతనాన్ని హెయిర్ అంగీకరించాడు. అంతేకాదు దొంగిలించిన మొత్తాన్ని షాప్ యజమానులకు తిరిగి ఇవ్వడంతోపాటు ఓ క్షమాపణ లేఖను కూడా రాసి ఇచ్చాడు. దీంతో స్ధానిక కోర్టు అతనికి ఎలాంటి శిక్ష వేయకుండా వదిలేసింది.

అయితే 18 నెలల పాటు మంచి ప్రవర్తనతో మెలుగుతానని ఓ బాండ్ రాయాల్సిందిగా హెయిర్‌ను స్ధానిక కోర్టు ఆదేశించింది. 1992 నుంచి 2008 మధ్య కాలంలో 78 టెస్టుకు హెయిర్ అంఫైర్‌గా వ్యవహరించాడు. 1995లో ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు సిరిస్‌తో హెయిర్ బాగా ప్రాచుర్యం పొందాడు.
ఈ సిరిస్‌లో శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ త్రో చేస్తున్నాడంటూ అంపైర్‌గా ఉన్న హెయిర్ పదే పదే నోబాల్‌గా ప్రకటించి అప్పట్లో వార్తల్లో నిలిచాడు. అంతేకాదు 2006లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరిస్‌లో పాక్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందంటూ ఆరోపించాడు.
దీంతో పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆడకుండా బయటకు వచ్చేసింది. దీంతో ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచినట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత హెయిర్‌ను టెస్టు ప్యానెల్ నుంచి ఐసీసీ తప్పించింది.