టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్రికెట్ పాఠాలు నేర్పిన్ క్లబ్‌కు ఎవిక్షన్ నోటీసులు అందాయి. ఈ వార్త విన్న పంత్ చాలా బాధ పడుతున్నట్లు చెప్పాడు. న్యూఢిల్లీలోని వెంకటేశ్వర కాలేజీలో సోనెట్ క్లబ్ ఉంది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన తారక్ సిన్హా ఈ క్లబ్‌లో యువతకు క్రికెట్ పాఠాలే నేర్పేవారు. ఈ క్లబ్‌లో ఇప్పటి వరకు 12 మంది భారత క్రికెటర్లు క్రికెట్ ఓనమాలు దిద్దారు.
వీరిలో పంత్ కూడా ఒకడు. ఈ క్రమంలోనే ఈ వార్తపై పంత్ స్పందించాడు. 'ఎంతోమంది అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసిన, చేస్తున్న నా క్లబ్‌కు ఎవిక్షన్ నోటీసు అందినట్లు తెలిసి చాలా బాధేసింది. నా క్రికెట్ కెరీర్‌ను నిర్మించడంలో ఈ క్లబ్ ఎంతో కీలక పాత్ర పోషించింది. నా వంటి వారు ఎందరికలో ఈ క్లబ్ ఎంతో చేసింది. మా అందరికీ ఇది ఇల్లు వంటి క్లబ్' అని పంత్ చెప్పుకొచ్చాడు.

ఈ క్లబ్‌ను 1969లో తారక్ సిన్హా లాంచ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర కాలేజీ కన్నా ముందు ఈ క్లబ్.. బిర్లా స్కూల్, అజ్మల్ ఖాన్ పార్క్, డీసీఎం గ్రౌండ్, పీజీడీఏవీ కాలేజ్, రాజధాని కాలేజ్, పిక్నిక్ హట్ వంటి ప్రాంతాల్లో నడిచింది. ప్రస్తుతం వెంకటేశ్వర కాలేజీ మేనేజ్‌మెంట్ చేతులు మారింది. కొత్తగా వచ్చిన యాజమాన్యం.. 22 ఏళ్లుగా కాలేజీలో ఉన్న క్లబ్ తమ క్యాంపస్ నుంచి తీసేయాలంటూ ఎవిక్షన్ నోటీసులు పంపింది. ఈ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించాలని కాలేజ్ యాజమాన్యాన్ని పంత్ కోరాడు.
'కాలేజ్ పెట్టిన రూల్స్‌ను మేం ఎప్పుడూ ఉల్లంఘించలేదు. సోనెట్ క్లబ్ అనేది జస్ట్ ఒక క్లబ్ మాత్రమే కాదు. ఎంతోమంది భావి క్రికెటర్లకు ఇల్లు వంటిది, క్రికెట్‌లో ఇదొక వారసత్వ ఇన్‌స్టిట్యూట్ వంటిది. అలాంటి క్లబ్‌ను బయటకు పంపాలనే నిర్ణయాన్ని వెంకటేశ్వర కాలేజ్ యాజమాన్యం మరొకసారి పునరాలోచించాలని అభ్యర్థిస్తున్నా' అని పంత్ ట్వీట్ చేశాడు. ఈ క్లబ్‌లో పంత్‌తోపాటు ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న ఆయుష్ బదోనీ, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హృతిక్ షోకీన్ తదితరులు కూడా క్రికెట్ నేర్చుకున్నారు.