చివరి రెండు టీ20లకు రోహిత్ అందుబాటులోకి.. అయినా అతని స్థానంలో ఓపెనర్‌గా, కెప్టెన్‌గా ఎవరంటే?

వెస్టిండీస్‌తో జరగబోయే చివరి రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడని పలు నివేదికలు వచ్చాయి. మూడో టీ20లో 5బంతుల్లో 11పరుగులు చేసిన రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న టైంలో వెన్ను గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ చేస్తుండగా అతనికి వీపులో కండరాలు పట్టుకున్నాయి. ఇక ఈ విషయమై రోహిత్‌కు వెన్ను నొప్పి వచ్చిందని, అతని రికవరీపై వైద్య బృందం ప్రయత్నాలు చేస్తోందని బీసీసీఐ ట్విట్టర్‌లో కూడా తెలిపింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో గేమ్‌లో విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ తన గాయం గురించి కూడా అప్డేట్స్ ఇచ్చాడు. చివరి రెండు టీ20Iలకు తాను కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా చూసుకుంటుంది
'ప్రస్తుతానికి పర్వాలేదు. 4వ మ్యాచ్‌కు మాకు కొన్ని రోజుల టైం ఉంది. అప్పటిలోపు గాయం బెడద ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను' అని రోహిత్ చెప్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి T20లో 44బంతుల్లో 64పరుగులతో రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. అతని కెప్టెన్సీలో భారత్ విజయ పరంపరను కొనసాగిస్తోంది. అందువల్ల జట్టు విజయాల్లో అతని పాత్ర చాలా కీలకంగా మారింది. త్వరలోనే ఆసియా కప్, టీ20ప్రపంచకప్ జరగబోతున్నందున రోహిత్ ఫిట్‌నెస్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ చాలా జాగ్రత్త పడుతుంది. అయితే శనివారం మరియు ఆదివారం చివరి రెండు గేమ్‌లకు రోహిత్ అందుబాటులో ఉంటాడు అని క్రిక్‌బజ్ తన నివేదికలో పేర్కొంది.

ఓపెనర్‌గా అతను.. కెప్టెన్‌గా ఇతను
ఒకవేళ రోహిత్ అందుబాటులోకి వచ్చినా చివరి రెండు టీ20లకు రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలనుకునే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే మున్ముందు కీలక సిరీస్‌లు ఉండడంతో రోహిత్‌ను చివరి రెండు టీ20ల్లో జట్టు మేనేజ్ మెంట్ ఆడించకపోవచ్చు. మళ్లీ గాయం తిరగబెడితే జట్టుకు తర్వాత ఇబ్బంది ఎదురవుతుంది. ఇక రోహిత్ గైర్హాజరీలో భారత్‌కు ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఆడే అవకాశముంది. అయితే జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై కాస్త డైలామా మాత్రం ఉండొచ్చు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిద్దరు ఇటీవల భారత్‌కు నాయకత్వం వహించారు. దాదాపుగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చు.

అందిన వీసాలు
సహాయక సిబ్బందితో సహా టీమిండియా మరియు వెస్టిండీస్ జట్టు సభ్యులకు ఇప్పటివరకు అందని యూఎస్ వీసాలు తాజాగా అందాయి. ఆరుగురు ఆటగాళ్లు ఇప్పటికే చార్టెడ్ ఫ్లైట్‌లో మయామికి చేరుకున్నారు. గయానా ప్రభుత్వం దౌత్యపరమైన విధానంలో కలగజేసుకుని పరిస్థితులను సద్దుమణిగించింది. నాలుగో మ్యాచ్ ఆగస్టు 6న జరగాల్సి ఉంది. మిగిలిన ఆటగాళ్లు ఈ రోజు రాత్రికి ఫ్లోరిడాకు చేరుకుంటారు. ఫ్లోరిడాలోని లౌడర్ హిల్‌లో నాలుగు, ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications