టెక్నాలజీ నుంచి బయటకు రండి, గెలిస్తే వచ్చేదేం లేదు: విరాట్ కోహ్లీ

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ యువతనుద్దేశించి సందేశమిచ్చాడు. 'కలలు కంటే వచ్చేదేమీ లేదు. వాటిని సాకారం చేసుకోవడానికి చెమటోడ్చండి.. మిమ్మల్ని మీరు నమ్మండి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ స్మార్ట్‌ఫోన్లు, టెక్నాలజీ వదిలి కాస్త బయటకు రండి' అని చెప్పుకొస్తున్నాడు కోహ్లి. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ తన అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించాడు. విజయాలెప్పుడూ ఏమీ నేర్పించవని, అపజయాలే మనిషిని రాటుదేలుస్తాయనీ విరాట్ అన్నాడు.

తాను బతికి ఉంటానని కూడా అనుకోవడం లేదని
కోహ్లి జరిపిన ఓ సర్వేలో దేశంలోని 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారిలో మూడోవంతు మంది ఏడాది కాలంగా అసలు ఎలాంటి శారీరక కసరత్తులు చేయలేదన్న చేదు వాస్తవం వెల్లడైంది. దీనిపై స్పందించిన కోహ్లి.. ఇది చాలా విషాదకరమని అన్నాడు. ఏడాది కాలంగా ఎలాంటి శారీరక కసరత్తు చేయకపోతే తాను కనీసం బతికి ఉంటానని కూడా అనుకోవడం లేదని విరాట్ చెప్పాడు.

రోజూ 4 నుంచి 5 గంటల పాటు స్మార్ట్‌ఫోన్లతో:
18 నగరాల్లో చేసిన సర్వేలో.. రోజూ నాలుగు నుంచి ఐదు గంటల పాటు స్మార్ట్‌ఫోన్లతో గడుపుతున్నారని తేలింది. ఇది చాలా ప్రమాదకరం. మానసిక, శారీరక వృద్ధికి ఏం చేయాలో అది చేయడం లేదు. నా చిన్నతనంలో సాధ్యమైనంత వరకు ఆరుబయట ఆడుకోవడానికే ప్రాధాన్యమిచ్చేవాళ్లం. వీకెండ్స్‌లో రోజంతా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లలో గడిపేవాళ్లం అని కోహ్లి చెప్పాడు.

ఫిట్‌నెస్‌తోనే మంచి ఆలోచనలు:
ఫిట్‌గా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫిట్‌నెస్ పెరిగే కొద్దీ నేను వీటిని గమనించాను. మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది. మంచి ఆలోచనలు రావాలంటే ముందు మనం బాగుండాలి. అందుకే ఫిట్‌గా ఉండాలని అందరికీ చెబుతుంటా అని కోహ్లి అన్నాడు. పిల్లలకు కూడా మంచి సందేశాన్నిచ్చాడు.

స్మార్ట్‌ఫోన్లకే బానిసైపోకుండా:
పూర్తిగా స్మార్ట్‌ఫోన్లకే బానిసైపోకుండా ఎప్పుడు ఏం చేయాలో ఒక ప్రణాళిక వేసుకోండి. ఎప్పుడు బయటకెళ్లి ఆడుకోవాలి. ఎప్పుడు హోంవర్క్ చేసుకోవాలి.. ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడాలి.. ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మంచి పౌరుడిగా ఎదుగుతారు అని కోహ్లి చెప్పాడు. ఇక పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులపై స్పందిస్తూ.. పరీక్షలు ఉన్న సమయాల్లోనూ నేను వెళ్లి క్రికెట్ ఆడేవాడిని. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోయేది. అది నాపై సానుకూల ప్రభావం చూపేది. మళ్లీ చదువుకోడానికి కావాల్సిన ప్రేరణ అందించేది అని కోహ్లి తెలిపాడు.

సామర్థ్యం ఉంది.. కానీ దానితో మీరేం చేస్తున్నారనేది ముఖ్యం:
మనిషి విజయం సాధించాలంటే నా వరకు రెండే విషయాలపై దృష్టిసారించాలి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు హార్డ్ వర్క్. అందరికీ సామర్థ్యం ఉంది. కానీ దానితో మీరేం చేస్తున్నారన్నది ముఖ్యం. కష్టపడి పనిచేసేతత్వం, ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్నది సాధించగలరు అని కోహ్లి స్పష్టంచేశాడు. ఇక చివరిగా విజయాలు నేర్పించేవి ఏమీ ఉండవని కూడా విరాట్ తేల్చి చెప్పాడు.

అవసరం లేని వ్యక్తులంతా వెళ్లిపోతారు:
వంద శాతం ఓటములే పాఠాలు నేర్పిస్తాయి. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాలన్నీ నన్నో ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి. మనం కష్టాల్లో ఉన్నపుడు మనకు అవసరం లేని వ్యక్తులంతా వెళ్లిపోతారు. నేను కష్టాలు ఎదుర్కొంటున్నపుడే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతా. నా జీవితంలో నాకు సాయపడినవి ఆ రోజులే అని కోహ్లి అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications