
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడ్ని ఒక్కసారైనా కలవాలని, అతడితో కలిసి ఫొటో దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఎంతో మంది అభిమానులు అనుకుంటారు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి భారత్-ఎసెక్స్ జట్ల మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఎసెక్స్ జట్టుతో చెమ్స్‌ఫోర్డ్‌లో జరిగింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఓ చిన్నారి కోహ్లీకి వీరాభిమాని.
ఐపీఎల్‌లో కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించి కోహ్లీని కలవాలని ఆ చిన్నారి తన తండ్రితో కలిసి మైదానానికి వచ్చింది. మైదానం సిబ్బందికి తన కోరిక చెప్పడంతో వారు ఆమెకు సహకరించారు. భారత ఆటగాళ్లు డ్రస్సింగ్ రూం నుంచి మైదానానికి వచ్చే దారిలో ఆమెను ఓ పక్క నిలబెట్టారు.
అయితే, భద్రతా కారణాల వల్ల ఆ చిన్నారి తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని కలవలేకపోయింది. ఇలా, రెండు రోజుల పాటు ఎంత ప్రయత్నించినా కోహ్లీ కలవడం కుదరకరపోవడంతో ఆ చిన్నారి నిరాశతో వెనుదిరిగింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ బుమ్రా ఆ చిన్నారిని కలిశాడు.
అయితే, ఇందుకు ఓ కారణం ఉంది. ఆ చిన్నారి తండ్రి ముంబై ఇండియన్స్ జట్టుకు వీరాభిమాని. ఈ సందర్భంగా బుమ్రా ముంబై ఇండియన్స్ క్యాప్‌పై అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కోహ్లీని కలుద్దామని మైదానానికి వచ్చిన చిన్నారి కల నెరవేరులేదు కానీ, ఆమె తండ్రి కోరిక మాత్రం నెరవేరింది.