
హైదరాబాద్: తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడమే గొప్పగా భావిస్తున్నామని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఫైనల్స్ ఫలితం గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురి అవదలచుకోలేదని చెప్పాడు. "నేను ట్రోఫీ ఎత్తుకుంటాననే విషయాన్ని తలకు ఎక్కించుకోను. అనవసరమైన విషయాలను పట్టించుకుంటే దాని ఫలితం మరోలా ఉంటుంది" అని మోర్గాన్ అన్నాడు.
"చాలా ప్రశాంతంగా ఉన్నా. అలాగే ఫైనల్స్‌లో ఆడటం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నా. ఏది ఏమైనా మేం ఆటని ఆస్వాదించాలనుకుంటున్నాం. మా జట్టులోని ప్రతీ ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నారు" అని ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదుసార్లు న్యూజిలాండ్ గెలవగా, నాలుగు సార్లు ఇంగ్లాండ్ విజేతగా అవతరించింది. 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన కివీస్.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఈ సారైనా విశ్వవిజేతగా నిలవాలని విలియమ్సన్ జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 1992 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ నేపథ్యంలో రెండు జట్లూ ఇప్పటివరకు ప్రపంచకప్ గెలవకపోవడంతో తొలిసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి. కాగా, ప్రపంచకప్ చరిత్రలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఐదోసారి ఫైనల్స్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. కాగా, ఈ ప్రపంచకప్ లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఫైనల్లో మాత్రం టాస్ ఎంతో కీలకం. గత పదకొండు ప్రపంచకప్ ఎడిషన్లలలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఏడుసార్లు విజయం సాధించాయి. ఇదిలా ఉంటే, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్ ఫైనల్స్‌కు వేదికగా నిలిచింది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్‌ల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే.. గత నాలుగు ఫైనల్స్‌లో మూడుసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజతగా నిలిచింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా... తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తారు. గతంలో ఇంగ్లండ్ మూడుసార్లు (1979, 1987, 1992ల్లో) ఫైనల్ చేరినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.