

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఇప్పటికే ఒక సిరీస్‌ను చేజిక్కుంచుకుని పైచేయి సాధించగా.. ఇంగ్లాండ్ మరో సారి అవకాశాన్ని జారవిడవకూడదన్నట్లు పోటీపడి ఆడుతోంది. ఇలాంటి హోరాహోరీ పోరులో.. హేమాహేమీ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ అంటే సాధారణంగానే బౌండరీల మోతను ఆశిస్తారు అభిమానులు. అలాంటిది మ్యాచ్ మొత్తంలో ఒక్క సిక్సు బౌండరీ కూడా లేకుండా మ్యాచ్‌ను ముగించేసింది టీమిండియా.
ఇంగ్లాండ్ చేతిలో భారీ తేడాతో ఓటమికి గురైన టీమిండియా... శనివారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ సేన తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేకపోయింది. టాస్ ఓడిన భారత్ మొదట బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. 86 పరుగుల తేడాతో కోహ్లీ సేన పరాజయం పాలైంది.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తక్కువ పరుగులకే ఔటవ్వడం.. ఆ తర్వాత కోహ్లీ, రైనా ఇన్నింగ్స్ చక్కదిద్దేలోపు వారు పెవిలియన్ బాట పట్టడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున 16 బౌండరీలు మాత్రమే నమోదు కాగా అవన్నీ ఫోర్లే. కోహ్లీ సేన ఒక్క సిక్స్ కూడా నమోదు చేయకపోవడం విశేషం. సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఇలా తన ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేకపోయింది. 2011లో ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడిన భారత్ అప్పుడూ ఒక్క సిక్స్ కూడా నమోదు చేయలేదు.
కాకపోతే ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో మాత్రం భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్ ఒక్క సిక్స్ కూడా నమోదు చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇంగ్లాండ్-ఇండియా 1-1పాయింట్లతో వన్డే సిరీస్‌లో ఆడుతుండగా.. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో మ్యాచ్ మంగళవారం జరగనుంది.