
సచిన్ ఔట్ అవ్వాలని కోరుకునేవాడిని కాదు:
బుధవారం వీడియో చాట్‌లో పాల్గొన్న రషీద్ లతీఫ్.. సచిన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. యువ క్రికెటర్లకు సచిన్ మార్గనిర్దేశకుడని, ఆట పట్ల అతనికి ఉన్న మక్కువ మరే ఇతర ఆటగాళ్లలో చూడలేదన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో చోటుచేసుకున్న వివాదాల్లో సచిన్ పేరు ఎక్కడా వినిపించని విషయాన్ని గుర్తుచేశాడు. 'నేను వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేవారు. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం అతడు ఔట్ అవ్వాలని నా మనసు ఎప్పుడూ కోరుకోలేదు. నేను కీపింగ్ చేసేప్పుడు కూడా అతడి బ్యాటింగ్‌ను ఇష్టంగా చూసేవాడిని. టీవీలో కంటే స్టంప్స్ వెనక నిలబడి ఉన్నప్పుడే ఎక్కువ ఆస్వాదించేవాడిని' అని లతీఫ్ తెలిపాడు.

అత్యుత్తమ 11 మంది క్రికెటర్ల జాబితాలో చోటు ఖాయం:
'సచిన్ స్థానంలో బ్రయన్ లారా, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఉంటే నా కీపింగ్‌లో వారిని ఔట్ చేయాలనే కోరుకుంటాను. 200 టెస్టులు, 400కి పైగా వన్డేలు ఆడటం మామూలు విషయం కాదు. క్రికెట్ చరిత్రలో ఏ రికార్డు చూసినా, అత్యుత్తమ 11 మంది క్రికెటర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు సచిన్. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సచిన్ వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. స్లెడ్జింగ్ చేసినా, ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా ఏకాగ్రత కోల్పోకుండా నవ్వుతాడు. సచిన్, మహ్మద్ అజారుద్దీన్ మాత్రమే ఇలా ఉంటారు' అని పాక్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.

సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని:
'ఆటగాళ్లు ఇన్నింగ్స్ అడతారు, వెళ్తారు. కానీ..మీ ప్రవర్తనను గుర్తుంచుకోవాలి. మైదానంలో మంచి వ్యక్తిత్వంతో మెలిగే వాళ్ల జాబితాలో సచిన్ ముందునిలుస్తాడు. అలాంటి వారు మీ జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అనేక మంది ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకున్నారు' అని లతీఫ్ చెప్పుకొచ్చాడు. రషీద్ లతీఫ్ పాక్ తరపున 37 టెస్టులు, 166 వన్డేలు ఆడాడు.

సెహ్వాగ్ అచ్చం సచిన్‌లా:
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొత్తలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అచ్చం సచిన్‌లా బ్యాటింగ్ చేసేవాడని రషీద్ లతీఫ్ వెల్లడించాడు. 1999లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సెహ్వాగ్.. మొదట్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. ఆ సమయంలో అతని స్టాన్స్, ఫుట్‌వర్క్, బ్యాటింగ్ స్టైల్ సచిన్‌లా ఉండేదన్నాడు. సెహ్వాగ్ అచ్చం సచిన్ తరహాలోనే ఫ్యాడ్స్, హెల్మెట్‌ని ధరించి ఉంటాడు కానీ దిగ్గజంతో పోలిస్తే కాస్త లావుగా కనిపిస్తాడన్నాడు.


Click it and Unblock the Notifications












