
మెల్‌బోర్న్: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 60.1 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అతిథ్య జట్టు ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దెబ్బ కొట్టడంతో ఇంగ్లండ్ 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో హాఫ్ సెంచరీతో రూట్ ఆదుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే రూట్ ఔట్ అవడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్, బోలాండ్, కామెరూన్ గ్రీన్, నాథన్ లియోన్ వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ 115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
చివర్లో బెయిర్‌స్టో, రాబిన్సన్ కాసేపు పోరాడినప్పటికీ జట్టు స్కోర్‌ను 200 కూడా దాటించలేకపోయారు. చివర్లో నాథన్ లియోన్ చెలరేగి వరుసగా మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 185 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 13 ఫోర్లు, 2 సిక్సులు నమోదయ్యాయి. 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
ఇంగ్లీష్ బ్యాటర్లలో కెప్టెన్ రూట్ 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో బెయిర్‌స్టో 35, స్టోక్స్ 25, రాబిన్సన్ 22, డేవిడ్ 14, జాక్ లీచ్ 13, జాక్ క్రాలే 12, మార్క్ వుడ్ 6, బట్లర్ 3 పరుగులు చేశారు. ఓపెనర్ హసీబ్ హమీద్ డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, లియోన్ మూడేసి వికెట్లు తీశారు. స్టార్క్ రెండు వికెట్లు తీశాడు. బోలాండ్, గ్రీన్ చెరో వికెట్ తీశారు.
యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే పూర్తైన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో సిరీస్‌లో నిలబడాలంటే ఆ జట్టు ఈ మ్యాచ్ గెలవడం లేదా కనీసం డ్రా చేసుకోవడం చేయాలి. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.