
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా మరికొద్దిసేపట్లో మెగా సమరం జరగనుంది. హిట్టర్లతో నిండిఉన్న ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టార్ ప్లేయర్స్ సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లీ, టామ్ కరన్, మార్క్ వుడ్‌లకు ఇంగ్లీష్ జట్టులో చోటు దక్కలేదు. అయితే ఇటీవలి కాలంలో వరుసగా విఫలమవుతున్న డేవిడ్ మలన్‌కు చోటు దక్కింది. మరోవైపు విండీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు అందరికి చోటు దక్కింది. ఆరేళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న పేసర్ రవి రాంపాల్ తుది టీంల ఉండడం విశేషం. గేల్, బ్రావో, రసెల్ లాంటి విండీస్ హిట్టర్లు ఈ మ్యాచ్ ఆడుతున్నారు.
దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత పేసర్ రవి రాంపాల్‌కు వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 2010 టీ20 ప్రపంచకప్ గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్న రవి రాంపాల్.. చివరగా టీ20 వరల్డ్ కప్ 2015లో ఆడాడు. సీనియర్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్ తమ స్థానాలను నిలుపుకున్నారు. పొట్టి క్రికెట్‌లో విండీస్ జట్టు 2010, 2016లో చాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ కొట్టేందుకు తహతహలాడుతోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉంది. హిట్లరు ఉన్న ఏ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
గత టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో విండీస్ జట్టు విజయం సాధించింది. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాది విండీస్‌ను గెలిపించాడు కార్లోస్ బ్రాత్‌వైట్. మ్యాచ్ ఇక ఇంగ్లండ్ గెలిచింది అనుకున్న ఆ జట్టు అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. అయితే తాజాగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో అటు స్టోక్స్‌తో పాటు బ్రాత్‌వైట్ కూడా లేకపోవడం గమనార్హం.
జట్లు:
వెస్టిండీస్: ఏవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్, క్రిస్ గేల్, శిమ్రాన్ హెట్మెయర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో, అకీల్ హసెన్, ఒబెడ్ మెకోయ్, రవి రాంపాల్.
ఇంగ్లండ్: జోస్ బట్లర్, జేసన్ రాయ్, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, టైమల్ మిల్స్.