హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 156 బంతుల్లో 21 ఫోర్లు సాయంతో 118 సెంచరీతో చెలరేగగా, మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ 186 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్టోన్‌మన్ (8), వెస్ట్‌లె (8) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. దీంతో 39 పరుగులకే ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన రూట్‌తో కలిసి కుక్ అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. దీంతో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. లంచ్ విరామం అనంతరం విరామం తర్వాత వీళ్లిద్దరు విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని స్కోరు బోర్డుని పరిగెత్తించారు.
ఈ క్రమంలోనే జో రూట్ 139 బంతుల్లో టెస్టుల్లో 13వ సెంచరీని పూర్తి చేసుకోగా, టీ విరామం తర్వాత అలెస్టర్ కుక్ కూడా సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో అలెస్టర్ కుక్‌కి ఇది 31 సెంచరీ. తొలి రోజు 136 పరుగుల వద్ద జో రూట్ అవుటవ్వగా, కుక్ మాత్రం 153 పరుగులతో క్రీజులో ఉన్నాడు.