
సౌతాంప్టన్: ఇంగ్లండ్-వెస్టిండీస్ తొలి టెస్టు అంచనాలకు అందకుండా సాగుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చెలరేగుతారనుకుంటే.. వెస్టిండీస్ పేస్ ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జేసన్ హోల్డర్ (6/42), షానన్ గాబ్రియేల్ (4/62) విజృంభణతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది. అనంతరం విండీస్ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసేసరికి విండీస్ ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 35/1తో రెండో రోజు (గురువారం) బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లిష్ జట్టు కొద్దిసేపటికే జో డెన్లీ (18; 58 బంతుల్లో) వికెట్ చేజార్చుకుంది. గాబ్రియేల్ వేసిన బంతికి డెన్లీ బోల్డ్ అయ్యాడు. 25.4వ బంతికి ఓపెనర్ రోరీ బర్న్స్ (30; 85 బంతుల్లో 4×4)ను కూడా గాబ్రియేలే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జాక్ క్రాలీ (10; 26 బంతుల్లో 2×4), ఒలివ్ పోప్ (12; 13 బంతుల్లో 2×4)ను హోల్డర్ పెవిలియన్ పంపించడంతో ఇంగ్లాండ్ 87/5తో కష్టాల్లో పడింది.
ఈ సమయంలో బెన్ స్టోక్స్ (43) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. జోస్ బట్లర్ (35)తో కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అర్ధ శతకానికి చేరువైన అతడిని 53.3వ బంతికి హోల్డర్ ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్ నుంచి వెళ్తున్న బంతి స్టోక్స్ బ్యాటు అంచుకు తగిలి డోరిచ్ చేతుల్లో పడింది. అప్పుడు స్కోరు 154. మరో మూడు పరుగులకే బట్లర్‌ను కూడా హోల్డరే పెవిలియన్ చేర్చాడు. డోరిచ్ ఈ సారి మెరుపు క్యాచ్ అందుకున్నాడు. ఆర్చర్ (0), మార్క్‌వుడ్ వెంటవెంటనే ఔటైనా చివర్లో అండర్సన్ (10; 20 బంతుల్లో)తో కలిసి డొమినిక్ బెస్ (31*) కీలకమైన 30 పరుగుల భాగస్వామ్యం అందించాడు. గాబ్రియేల్ వేసిన 67.3వ బంతికి వికెట్లు ఎగిరిపడటంతో అండర్సన్ పెవిలియన్ చేరాడు.
విండీస్ పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. సాధికారికంగా ముందుకు సాగింది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రెండుసార్లు వికెట్ల ముందు దొరికిపోయినా.. డీఆర్‌ఎస్‌తో బయటపడ్డ ఓపెనర్ క్యాంప్‌బెల్ (28) ఎట్టకేలకు మూడోసారి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ జట్టుకు కాస్త సానుకూల అంశం ఇదే. రెండో రోజు ఆట నిలిచిపోయే సరికి విండీస్ వికెట్ నష్టపోయి 57 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 9, షై హాప్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 204 ఆలౌట్ ( స్టోక్స్ 43, బట్లర్ 35, బెస్ 31 నాటౌ ట్; హోల్డర్ 6/42, గాబ్రియల్ 4/62), వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 57/1 (బ్రాత్‌వైట్ 20 నాటౌట్, హోప్ 3 నాటౌట్; అండర్సన్ 1/17).