
మాంచెస్టర్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు ఆరంభమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి టెస్టులో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ అజహర్ అలీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టెస్టులో పాక్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. కరోనా విరామం తర్వాత పాక్ ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే. మరోవైపు విన్నింగ్ జట్టుతోనే ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఇప్పటికే వెస్టిండీస్‌తో మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
పాకిస్తాన్ నుంచి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లీష్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. స్వదేశంలో టెస్టుల్లో ఇంగ్లండ్ అత్యంత బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడి బౌన్సీ, స్వింగ్ పిచ్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతాయి. ఇలాంటి ప్రతికూలతల మధ్య ఆ జట్టును పాక్ ఎలా నిలువరిస్తుందో చూడాలి. అయితే గత రెండు పర్యటనలను (2016లో 2-2, 2018లో 1-1) పాక్ డ్రాగా ముగించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
పాకిస్తాన్ జట్టు బౌలింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. యువ పేసర్లు నసీమ్ షా, షహీన్ అఫ్రిది ఉరకలెత్తే ఉత్సాహం మీద ఉన్నారు. బ్యాటింగ్ బలం ప్రధానంగా ఇద్దరు టాప్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్, కెప్టెన్ అజహర్ అలీలపైనే ఆధారపడి ఉంది. వీరిద్దరు మాత్రమే నిలకడగా ఆడగల సమర్థులు. అసద్ షఫీఖ్, ఓపెనర్ షాన్ మసూద్, హారిస్ సొహైల్ కూడా తమ వంతు బాధ్యత పోషించాల్సి ఉంది. పాక్ చివరిసారిగా 1996లో ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ నెగ్గింది. ఇంగ్లండ్‌లో పాకిస్తాన్ 53 టెస్టులు ఆడగా.. 12లో గెలిచి, 23లో ఓడింది. మరో 18 డ్రాగా ముగిశాయి.
Teams:
England: Rory Burns, Dominic Sibley, Joe Root (c), Ben Stokes, Ollie Pope, Jos Buttler (wk), Chris Woakes, Dominic Bess, Jofra Archer, Stuart Broad, James Anderson.
Pakistan: Shan Masood, Abid Ali, Azhar Ali (c), Babar Azam, Asad Shafiq, Mohammad Rizwan (wk), Shadab Khan, Yasir Shah, Mohammad Abbas, Shaheen Afridi, Naseem Shah.