
మాంచెస్టర్: మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 169 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇంగ్లండ్ ముందు పాక్ 277 పరుగుల లక్ష్యంను ఉంచింది. పాకిస్థాన్ 169 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో ఇంగ్లీష్ జట్టులో గెలుపు ఆశలు చిగురించాయి. ఐదు సెక్షన్ల ఆట మిగిలిఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మ్యాచ్ నాలుగో రోజైన శనివారం 137 పరుగులకు 8 వికెట్ల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన పాక్ 169 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో వచ్చిన పాక్ స్పిన్నర్ యాసిర్ షా (33) టాప్ స్కోరర్. మిగిలిన వారు ఎవరూ 30పరుగుల మార్క్‌ను కూడా దాటలేకపోయారు. యాసిర్ షా నిన్నటి పరుగులకు 21 పరుగులు జతచేయగా.. మొహమ్మద్ అబ్బాస్ మూడు రన్స్ చేశాడు. నసీం షా 4 రన్స్ చేశాడు. జోఫ్రా ఆర్చర్.. నసీంను బోల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ మూడు, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. డోమ్ బెస్, జొఫ్రా ఆర్చర్ చెరో వికెట్ పడగొట్టారు.
277 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళుతోంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో ఇంగ్లీష్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోరి బర్న్స్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఎల్బీగా మొహమ్మద్ అబ్బాస్ ఔట్ చేసాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే నిలకడగా ఆడుతున్నాడు. అతనికి కెప్టెన్ జో రూట్ అండగా నిలిచాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 55 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 222 పరుగులు చేయాలి. క్రీజులో సిబ్లే (26) రూట్ (18) ఉన్నారు. వికెట్ తీసేందుకు పాక్ బౌలర్లు శ్రమిస్తున్నారు.
ఓపెనర్ షాన్ మసూద్ (156; 319 బంతుల్లో 184, 26) అద్భుత సెంచరీ చేయడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. పాక్ పేసర్ల ధాటికి తడబడ్డ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌట్ అయింది. సయీద్ అన్వర్ (1996) తర్వాత ఇంగ్లండ్‌లో టెస్టు శతకం సాధించిన తొలి పాక్ ఓపెనర్‌గా మసూద్ ఘనత సాధించాడు. టెస్టుల్లో మసూద్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. వరుసగా మూడోది కావడం విశేషం. నిరుడు డిసెంబరులో శ్రీలంకపై 135 చేసిన అతడు.. తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌పై 100 కొట్టాడు.