రుజువు చేసుకోవాలనే: కోహ్లీ, టెస్టు సిరిస్‌పై సచిన్, ద్రవిడ్ ఇలా!

హైదరాబాద్: ఫలానా దేశంలో రుజువు చేసుకోవాలనే ఆలోచన దృక్పథంలో తాను లేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇంగ్లీషు గడ్డపై కోహ్లీసేన పరీక్షకు సిద్ధమైంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బుధవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.
గాయాలతో కీలక బౌలర్లు దూరమైన అత్యంత కీలకమైన ఈ టెస్టు సిరిస్‌లో శుభారంభం చేయాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది. కెప్టెన్‌గా కోహ్లీకిది అత్యంత కఠినమైన సిరీస్. ఇక, ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఈ టెస్టు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుకి ఇది 1000వ టెస్టు.
తన 1000వ టెస్టులో విజయం సాధించి సంబరాలు చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తుంటే.. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను గెలుపుతో ఆరంభించాలని కోహ్లీసేన భావిస్తోంది. టీమిండియా చివరిసారిగా 2007లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచింది.
2011, 2014లో ఇంగ్లాండ్ దారుణ ఓటమి
ఆ తర్వాత ధోని సారథ్యంలోని టీమిండియా 2011, 2014లో ఇంగ్లాండ్‌లో దారుణంగా ఓటమిపాలై 4-0, 3-1తో సిరీస్‌లను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరిస్ గెలవాలనే కసితో కోహ్లీసేన ఉంది. దీంతో తొలి టెస్టు ఆరంభానికి ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "ఫలానా దేశంలో రుజువు చేసుకోవాలనే ఆలోచన దృక్పథంలో నేను లేను. జట్టు కోసం ఆడటమే నాకు ప్రధానం. అయితే జట్టు కోసం పరుగులు చేయాలని కచ్చితంగా కోరుకుంటా. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడమే నా ముఖ్య ఉద్దేశం" అని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
మా దృష్టంతా దానిపైనే
"ఇక ఒక జట్టుగా మేం సిరీస్‌లో ఫేవరెట్లుగానో.. అండర్‌డాగ్స్‌గానో ఒక ముద్ర వేయించుకుని బరిలోకి దిగాలని భావించట్లేదు. నిలకడగా ఆడటం, మెరుగైన ప్రదర్శన చేయడంపైనే మా దృష్టంతా" అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఇంగ్లీషు గడ్డపై టీమిండియా ఆడిన 57 టెస్టుల్లో గెలిచింది ఆరే. అయితే, ఈ ఆరింట్లో మూడు 2002 నుంచి గెలిచినవి కావడం విశేషం. ఇక, తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా పేలవ రికార్డుని కలిగి ఉంది. 1967 నుంచి ఇక్కడ ఆరు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఐదింట్లో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రతి ఆటగాడి కెరీర్లోనూ ఒడుదొడుకులుంటాయి
ఇంగ్లీషు గడ్డపై కోహ్లీ సారథ్యంలోని టీమిండియా తొలిసారి టెస్టు సిరిస్‌ను ఆడనున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు స్పందించారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "ప్రతి ఆటగాడి కెరీర్లోనూ ఒడుదొడుకులుంటాయి. కొన్ని పర్యటనలు చేదు అనుభవాలు మిగులుస్తాయి. కథ అక్కడితో ముగిసిపోదు. కోహ్లీ విషయంలోనూ అంతే. కోహ్లీలో ఉన్న అత్యుత్తమ లక్షణమేంటంటే.. తాను మెరుగు పడాల్సిన విషయాలు ఏవైనా ఉన్నాయంటే వాటిని వెంటనే గుర్తించి వాటి మీద దృష్టిపెడతాడు. తన లోపాల్ని అంగీకరించి, వాటిని సరిదిద్దుకున్నపుడే ఏ ఆటగాడైనా ముందంజ వేయగలుగుతాడు" అని సచిన్ పేర్కొన్నాడు.

కోహ్లీ సన్నద్ధమయ్యే తీరు చాలా బాగుంటుంది
"కోహ్లీ కళ్లలో ఆటపై ఎప్పుడూ ఒక ఆకలి, ఒక తపన కనిపిస్తాయి. ఒక పర్యటనకు ముందు కోహ్లీ సన్నద్ధమయ్యే తీరు చాలా బాగుంటుంది. కోహ్లీ ప్రస్తుతం సరైన స్థితిలో ఉన్నాడు. ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నా" అని సచిన్ అన్నాడు. ఇక, రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌లో పరిస్థితులకు భారత ఆటగాళ్లు ఎంత త్వరగా అలవాటు పడతారన్నది కీలకం. 2007లో మేం గెలిచింది మూడు టెస్టుల సిరీస్" అని తెలిపాడు.

భారత్ 2-1తో గెలుస్తుందన్నది నా అంచనా
"ఆరంభం పేలవంగా ఉన్నా పుంజుకోవడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు ఐదు టెస్టుల సిరీస్ కాబట్టి ఆరంభం ఎలా ఉన్నా పుంజుకోవడానికి అవకాశముంటుంది. సిరీస్‌లో భారత్‌కు మంచి అవకాశాలే ఉంటాయని అనుకుంటున్నా. బౌలర్లు 20 వికెట్లు తీయడం కీలకం. బౌలర్లు ఫిట్‌గా ఉండి, మెరుగైన ప్రదర్శన చేయడం కీలకం. సిరీస్‌ను భారత్ 2-1తో గెలుస్తుందన్నది నా అంచనా" అని ద్రవిడ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications