
సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 13 ఫోర్లతో ఖవాజా 137 పరుగులు సాధించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. 8 వికెట్ల నష్టానికి 416 వద్ద తమ స్కోర్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టోపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజులో హమీద్(2), క్రాలే(2) ఉన్నారు.
నేడు ఉదయం 126-3తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు స్టీవెన్ స్మిత్, ఖవాజా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 67 పరుగులు చేసిన స్మిత్ బ్రాడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోర్ 232 పరుగుల వద్ద స్మిత్, ఖవాజా భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే బ్రాడ్ మరోసారి సత్తా చాటాడు. జట్టు స్కోర్ 242 పరుగుల వద్ద ఉండగా 5 పరుగులు చేసిన గ్రీన్‌ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత వికెట్ కీపర్ ఆలెక్స్ కారీతో కలిసి ఖవాజా ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 13 పరుగులు చేసిన కారీని రూట్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కమిన్స్, ఖవాజా ఏడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 24 పరుగులు చేసిన కెప్టెన్ కమిన్స్‌ను బ్రాడ్ ఫెమిలియన్ పంపాడు. ఇక జట్టు స్కోర్ 398 పరుగుల వద్ద ఉండగా సెంచరీ హీరోను ఖవాజాను బ్రాడ్ బౌల్డ్ చేశాడు. జట్టు స్కోర్ 8 వికెట్ల నష్టానికి 416 పరుగుల వద్ద ఉండగా ఆస్ట్రేలియా తమ స్కోర్‌ను డిక్లేర్డ్ చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ వికెట్లతో చెలరేగాడు. మిగతా వారిలో అండర్సన్, రూట్, మార్క్ వుడ్ తలో వికెట్ తీశారు. మొత్తం 92 ఓవర్లపాటు సాగిన రెండో రోజు ఆటలో 5 వికెట్లు నేలకూలగా.. 303 పరుగులు వచ్చాయి. కాగా 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకుంది.