
హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో లీడ్స్ వేదికగా గురువారం నుంచి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది.
తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలతో మెరిసిన స్టీవ్ స్మిత్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి అతడి మెడను బలంగా తాకడంతో గాయపడ్డాడు. దీంతో గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే, గురువారం మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆంటిగ్వా వేదికగా రాత్రి 7 గంటలకు టెస్టు జరగనుండగా... న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య కూడా టెస్టు జరగనుంది. దీంతో క్రికెట్ అభిమానులు సంతోషంగా ఉన్న ఫోటోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.