బెన్ స్టోక్స్ మూవీ ట్రైలర్ రిలీజ్.. కెరీర్ ఎత్తుపల్లాల గురించి పూసగుచ్చినట్లు షూట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

అమెజాన్ ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ జీవితాన్ని డాక్యుమెంటరీ మూవీగా తీసింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆగస్టు 26న ప్రైమ్ వీడియోలో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మూడు నిమిషాల నిడివితో ఉంది. ఈ ట్రైలర్లో అతను తన కెరీర్‌లో ఎదుర్కొన్న అప్ అండ్ డౌన్స్‌ను చూపించారు. అతని సహచరులు జో రూట్, స్టువర్ట్ బ్రాడ్ అతని గురించి తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. ఈ ట్రైలర్‌పై అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా ఈ డాక్యుమెంటరీ పెద్ద విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఏడాదిన్నర పాటు కలిసి
ప్రముఖ టీవీ నిర్మాణ సంస్థ అయిన విస్పర్ 2గంటల నిడివి గల డాక్యుమెంటరీని నిర్మించడానికి స్టోక్స్‌తో కలిసి ఏడాదిన్నర పాటు పనిచేస్తోంది. ఇక రెడ్ బుల్ కంపెనీ ఈ డాక్యుమెంటరీని స్పాన్సర్ చేస్తుండగా.. అమెజాన్ ప్రైమ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తుంది. 2022 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ పర్యటనలో బెన్ స్టోక్స్ కెమెరా సిబ్బందితో తరచుగా ఇదే డాక్యుమెంటరీ విషయమై కనిపించాడు. ఈ డాక్యుమెంటరీ కోసం స్టోక్స్‌తో పాటు అతని సహచర ప్లేయర్ల ఇంటర్వ్యూలు తీసుకోవడానికి అమెజాన్ ప్రైమ్ ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అనుమతిని కూడా తీసుకుంది.

ఆ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం
గతేడాది మెంటల్ రిలాక్సేషన్ కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని బెన్ స్టోక్స్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో స్టోక్స్ తన మానసిక ఆందోళన ఎలా ఉందో చెప్పాడు. అతని సహచర ప్లేయర్ బ్రాడ్ మాట్లాడుతూ..'అతను మళ్లీ ఆడడం నేను చూస్తాననుకోలేదు' అని పేర్కొన్నాడు. మెంటల్ రిలాక్సేషన్ నిర్ణయం అతని కెరీర్‌కు ముగింపు పలుకుతుందని అందరు భావించారు. కానీ అతను తన డిప్రెషన్ నుంచి గొప్పగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా విజయవంతమైన పంథాలో కొనసాగుతున్నాడు.

జైల్లో పడ్డ ఘటన గురించి..
మరో సహచర ప్లేయర్ జో రూట్ మాట్లాడుతూ.. 'అతనిలోని ఎన్నో గొప్ప విషయాలను చాలా మంది చూడలేకపోయారు. కానీ అతను ఎంత గొప్పోడో నాకు తెలుసు. అతని గురించి నాకు అంతగా తెలిసినందుకు నేను గర్విస్తున్నాను.' అని పేర్కొన్నాడు. 2017లో బ్రిస్టల్‌లోని నైట్‌క్లబ్ దగ్గర అతను ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించడం పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫుటేజీని కూడా ట్రైలర్లో చూపించారు. ఈ ఘటన తర్వాత 2017-18లో ఇంగ్లాండ్ యాషెస్ జట్టులో అతను చోటు కోల్పోయాడు. పోలీసులు స్టోక్స్‌ను అరెస్టు చేసి విచారణలో ఉంచారు. అనంతరం జరిమానా, ఎనిమిది మ్యాచ్‌ల నిషేధంతో అతను జైలు నుంచి బయటికొచ్చాడు.

ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి
ఈ 31ఏళ్ల ఆల్‌రౌండర్ టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇంగ్లాండ్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమితుడైనప్పటి నుంచి ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందింది. అతను ఐసీసీ టెస్ట్ ఆల్-రౌండర్ల చార్ట్‌లో ప్రస్తుతం అయిదో స్థానంలో ఉన్నాడు. ఈ తరంలోని అత్యుత్తమ ప్లేయర్లలో స్టోక్స్ కూడా ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్టోక్స్ ఇటీవలే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా రెండు ఫార్మాట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications