ఇంగ్లండ్ టీమ్‌లో ఎవరు, ఏ దేశానికి చెందిన క్రికెటరో తెలుసా?

లండన్: ఎట్టకేలకు ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది ఇంగ్లండ్ క్రికెట్ జట్టు. 44 సంవత్సరాల కలను సాకారం చేసుకుంది. 1975లో ఆరంభమైన ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మూడుసార్లు ఫైనల్ తలుపు తట్టినప్పటికీ.. అదృష్టం వరించలేదు. ప్రపంచకప్ ఆరంభమైన తొలి ఏడాదే ఫైనల్ మ్యాచ్‌లో అడుగు పెట్టింది. అయినప్పటికీ- అప్పటి వెస్టిండీస్ జట్టు పవర్ ప్లే ముందు- నిలవలేకపోయింది ఇంగ్లీష్ టీమ్.
ఆ తరువాత కూడా రెండుసార్లు ఫైనల్‌లో ఆడుగు పెట్టినా కప్‌ను అందుకోలేకపోయింది.
రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆధునిక క్రికెట్‌లో ఆ కొరతను, లోటును భర్తీ చేసుకుంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన మ్యాచ్, అనంతరం సూపర్ ఓవర్ టైగా ముగిసినప్పటికీ.. అత్యధిక బౌండరీలను బాదిన కారణంగా- ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇది కాస్తా తీవ్ర విమర్శలకు దారి తీసిందనుకోండి, అది వేరే విషయం.

ప్రపంచకప్ అందించిన పొరుగు దేశపు క్రికెటర్..
నిజానికి- ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న 44 సంవత్సరాల ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కలను సాకారం చేసిన కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ ఇంగ్లండ్ జాతీయుడు కాదు. ఆయన ఐర్లాండ్ జాతీయుడు. ఐర్లాండ్‌లోనే పుట్టాడు. అక్కడే పెరిగాడు. క్రికెట్‌పై మక్కువతో ఇంగ్లాండ్‌కు వలస వచ్చాడు. కౌంటీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అనంతరం జాతీయ క్రికెట్‌లో చోటు దక్కించుకున్నాడు. కేప్టెన్‌గా పగ్గాలనూ అందుకున్నాడు. ఎట్టకేలకు ఇంగ్లండ్ జట్టును ప్రపంచకప్ టోర్నమెంట్ జగజ్జేతగా నిలిపాడు.

న్యూజిలాండర్.. బెన్‌స్టోక్స్
ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు విజయానికి సైంధవుడిలా అడ్డు పడ్డ క్రికెటర్ బెన్‌స్టోక్స్. అటు బంతితో, ఇటు బ్యాట్‌తో, ఫీల్డర్‌గా అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న బెన్ స్టోక్స్.. నిజానికి ఇంగ్లండ్ దేశస్థుడు కాదు. న్యూజిలాండర్. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్చించాడు బెన్‌స్టోక్స్. అక్కడే పుట్టి, అక్కడే పెరిగాడు. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. ఇక అక్కడే స్థిరపడ్డాడు. క్రికెట్‌ను తన కేరీర్‌గా ఎంచుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్లాస్టింగ్ బ్యాట్స్‌మెన్.. ఇంగ్లండ్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ సాధించిన అన్ని విజయాల్లోనూ బెన్‌స్టోక్స్ పాత్ర ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా 98 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 84 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు.

దక్షిణాఫ్రికాలో జన్మించిన జేసన్ రాయ్..
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ కూడా ఆ దేశంలో జన్మించలేదు. అతను దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించాడు. అనంతరం జేసన్ రాయ్‌కు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు ఇంగ్లండ్‌కు వలస వచ్చారు. అక్కడే స్థిరపడ్డారు. క్రమంగా అతను క్రికెటర్‌గా రాటుదేలాడు. జోఫ్రా ఆర్చర్ కూడా ఇంగ్లండ్‌కు చెందిన క్రికెటర్ కాదు. వెస్టిండీస్ క్రికెటర్. కరేబియన్ దీవుల్లోని బార్బడొస్‌లో జన్మించాడు. జోఫ్రా తండ్రి బ్రిటీష్ దేశస్తుడు.

వారిద్దరి మూలాలు పాకిస్తాన్‌లో..
ఇక మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఇద్దరూ ఇంగ్లండ్‌లో జన్మించినప్పటికీ.. వారి పూర్వీకులు పాకిస్తాన్‌కు చెందిన వారు. మొయిన్ అలీ పూర్వీకులు పాకిస్తాన్ నుంచి వలస వెళ్లారు. అలీ బర్మింగ్‌హామ్‌లో జన్మించాడు. ఆదిల్ రషీద్ పూర్వీకులు కూడా పాకిస్తానీయులే. ఆదిల్ రషీద్ బ్రాడ్‌ఫొర్డ్‌లో జన్మించాడు. ఇంగ్లండ్‌కు ఇది కొత్తేమీ కాదు. ఇంతకుముందు- ఇంగ్లండ్ జట్టుకు సారథ్యం వహించిన నాజర్ హుస్సేన్ స్వయానా భారతీయుడు. నాజర్ హుస్సేన్ పుట్టింది గుజరాత్‌లోని సూరత్‌లో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications