శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (62 నాటౌట్; 128 బంతుల్లో, 2 ఫోర్లు) క్లాసిక్ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (39; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), ఓపెర్ డానియల్ లారెన్స్ (34; 54 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.
అయితే 205 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. 70 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ బెన్ డకెట్ (11), కెప్టెన్ ఒలీ పోప్ (6) నిరాశపరిచారు. ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన జో రూట్.. హ్యారీ బ్రూక్ (32; 68 బంతుల్లో, 3 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

లంక బౌలర్లు పుంజుకుని బ్రూక్‌ను ఔట్ చేసినా.. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో స్మిత్‌తో కలిసి రూట్ మరో కీల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. రూట్ బ్రూక్‌తో కలిసి 49 పరుగులు, స్మిత్‌తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాల్ని నమోదుచేశాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (74), మిలన్ రత్నాయకె (72) సత్తాచాటారు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ చెరో మూడు వికెట్లు తీశారు.
అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగుల భారీ స్కోరు చేసింది. జేమీ స్మిత్ (111)శతకం సాధించాడు. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో నాలుగు, ప్రభత్ మూడు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో లంక 326 పరుగులు చేసింది. కామిందు మెండిస్ (113) సెంచరీ బాదాడు. క్రిస్ వెక్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 57.2 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.