
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఘోరపరాజయం పాలైన ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్‌లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా నిలిచింది. మూడో టెస్ట్ మ్యాట్ ఓటమితో ఈ జాబితాలో ఇప్పటికే మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో కలిసి సమంగా నిలిచింది. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ 9 మ్యాచ్‌ల్లో ఓడింది. 2003లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కూడా ఆ సంవత్సరంలో 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. దీంతో ప్రస్తుతం జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు ఓటముల పరంగా ఆస్ట్రేలియా సృష్టించిన చెత్త రికార్డును సమం చేసింది.
మొత్తంగా ఈ ఏడాది 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 4 మాత్రమే గెలిచింది. ఏకంగా 9 మ్యాచ్‌లు ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు మాత్రం డ్రా చేసుకుంది. అలాగే ఈ ఏడాది 29 ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు ఏకంగా 14 సార్లు 200 పరుగుల లోపే ఆలౌటైంది. రెండు సార్లు 100 పరుగుల లోపే ఆలౌటైంది. ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టులోని బ్యాటర్లు ఏకంగా 54 సార్లు డకౌట్ అయ్యారు. ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టు బ్యాటర్లు ఎంత దారుణంగా విఫలమయ్యారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇంగ్లీష్ జట్టు బ్యాటర్ల తీరుపై అటు మాజీలతోపాటు ఇటు అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా యాషెస్ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే ఈ ఏడాది 9 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ జట్టు 6 గెలిచింది. రెండింటిలో ఓడగా.. ఒకటి డ్రా అయింది. ఇక టీ20ల విషయానికొస్తే 17 మ్యాచ్‌లు ఆడింది. అందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 6 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్ మొత్తంలో ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ రూట్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు.
మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో అంతకన్నా దారుణంగా 27 ఓవర్లలో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అతిథ్య ఆస్ట్రేలియా 267 పరుగులే చేసినప్పటికీ ఇంగ్లండ్ బ్యాటర్ల వైఫల్యంతో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.