England Playing 11:ఇంగ్లండ్‌కు గాయాల దెబ్బ! రాయ్ ఔట్.. బిల్లింగ్స్ ఇన్! న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే జట్టిదే!

హైదరాబాద్: నెల రోజులుగా అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ 2021 చివరి ఘట్టానికి చేరుకుంది. ఈరోజు రాత్రి అబుదాబి వేదికగా జరిగే తొలి సెమీస్‌లో రెండు అగ్రశ్రేణి జట్లు తలపడనున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లండ్.. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ ప్రపంచకప్ సెమీఫైనల్లో సై అంటున్నాయి. బలాబలాలు చూస్తే ఏ జట్టుకా జట్టే పటిష్టంగా ఉంది. అయితే చరిత్ర మాత్రం ఇంగ్లండ్ జట్టువైపే ఉంది.
2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లీష్ జట్టు గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తన ఆధిపత్యం కొనసాగుతుందా లేదా చూడాలి. మ్యాచ్ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టును ఓసారి పరిశీలిద్దాం.

రికార్డ్స్, పిచ్ రిపోర్ట్
టైటిల్ ఫేవరేట్‌గా టీ20 ప్రపంచకప్ 2021లో అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అంచనాలు నిలబెట్టుకుంటూ సాగుతోంది. గ్రూప్-1లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు అయిదు మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ మూడు, న్యూజిలాండ్ రెండు మ్యాచులు గెలిచాయి. అబుదాబి పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకరించే అవకాశం ఉంది.
అలాగే బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగానే ఉంటుంది. దాంతో ఈరోజు బ్యాట్‌కు బంతికి మధ్య మంచి పోరుగా మారే అవకాశముంది. రాత్రి పూట మ్యాచ్‌లో మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం కలుగుతోంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది.

ఇంగ్లండ్‌కు గాయాల దెబ్బ
సూపర్-12 దశలో చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కాస్త నిరాశ కలిగించినా.. తిరిగి పుంజుకునే సత్తా ఇంగ్లండ్‌కు ఉంది. అయితే ఇంగ్లీష్ జట్టును గాయాలు కలవరపెడుతున్నాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా పిక్క గాయానికి గురైన స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లలో వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన స్టార్ పేసర్ టైమల్ మిల్స్ తొడ కండరాల గాయంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.
కీలక సెమీస్‌కు రాయ్, మిల్స్ దూరమవడం మోర్గాన్ సేనకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరమయినా ఇంగ్లండ్ జట్టు ఇప్పటికి పటిష్టంగానే ఉంది. ఇది ఇంగ్లీష్ జట్టుకు సానుకూలాంశం.

రాయ్ స్థానంలో సామ్ బిల్లింగ్స్
జొస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్‌లతో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే టోర్నీలో ఓ సెంచరీ బాదేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. రాయ్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బిల్లింగ్స్ కూడా హిట్టర్ అన్న విషయం తెలిసిందే. మోర్గాన్ ఫామ్ అందుకుంటే ఇంగీష్ భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ గొప్పగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అలీ బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. పేసర్లు మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్ ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తే ఆ జట్టుకు తిరుగుండదు.

తుది జట్టు (అంచనా)
ఇంగ్లండ్: జొస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications