
బ్రిస్టల్: ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంక బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌటైన లంక.. మూడో వన్డేలో 166 పరుగులకే చాపచుట్టేసింది. శ్రీలంక 41.1 ఓవర్లలో 166 రన్స్ చేసి.. ఇంగ్లండ్ ముందు 167 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఆల్‌రౌండర్ దసున్ శనక (48 నాటౌట్; 65 బంతుల్లో 2x4, 2x 6) ఒంటరి పోరాటం చేశాడు. శనక పోరాడకుంటే లంక పరువుపోయేదే. ఇంగ్లండ్ పేసర్లు క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, టామ్ కరన్ ధాటికి లంక బ్యాట్స్‌మన్ క్రీజులో నిలబడలేక పెవిలియన్ బాట పట్టారు. శనక తర్వాత వహిందు హాసరంగ (20) టాప్ స్కోరర్.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. శ్రీలంక బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ ఆరంభించిన లంకకు ఆదిలోనే ఇంగ్లండ్ పేసర్లు క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ షాక్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి పోటీపడి మరీ వికెట్లు తీయడంతో లంక టాప్-4 బ్యాట్స్‌మన్ త్వరగానే ఔట్ అయ్యారు. అవిష్క ఫెర్నాండో (14), కుశాల్ పెరీరా (9), పాతుమ్ నిస్సంకా (6), ధనంజయ్ డి సిల్వా (4) పూర్తిగా నిరాశపరిచారు. లంక 42 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ సమయంలో ఓషాడా ఫెర్నాండో (18), వహిందు హాసరంగ (20) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే టామ్ కరన్ లంకను కోలుకొని దెబ్బకొట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ను తన పదునైన బంతులతో బోల్తాకొట్టించాడు. ముందుగా ఫెర్నాండో, హాసరంగలను ఔట్ చేసిన కరన్.. ఆ తర్వాత చమిక కరుణరత్నే (11), బినురా ఫెర్నాండో (7)లను పెవిలియన్ చేర్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఆల్‌రౌండర్ దసున్ శనక ఒంటరి పోరాటం చేశాడు. టేయిలెండర్లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో లంక స్కోర్ 150 దాటింది. అసితా ఫెర్నాండో రనౌట్ అవ్వడంతో లంక ఆలౌట్ అయింది. దీంతో శనక హాఫ్ సెంచరీ ముందు నిలిచిపోయాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఇన్నింగ్స్ బ్రేక్ మధ్యలో వర్షం కురవడంతో ప్రస్తుతం ఆట ఇంకా మొదలుకాలేదు. వర్షం కారణంగా పిచ్, మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పిఉంచారు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గగా.. రెండో వన్డేలో 8 వికెట్లతో గెలుపొందింది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 3-0తో గెలుచుకుంది. మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు ఇలా విఫలమవుతుండటంపై పలువురు మాజీలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, వెంటనే తగు చర్యలు తీసుకొని జట్టును కాపాడాలని వారు బోర్డును కోరుతున్నారు.