
హైదరాబాద్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 285/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ కోల్పోయింది.
రెండో రోజు ఆట ప్రారంభం కాగానే షమీ మరోమారు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. షమీ బంతిని ఎదుర్కొనే క్రమంలో శామ్ కర్రన్(24).. కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా, షమీ 3, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇక, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ జో రూట్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో 70 పరుగులతో ఫరవాలేదనిపించాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించిన తర్వాత జో రూట్ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.
మొదటిరోజైన గురువారం చివరి సెషన్‌లో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి రోజు ఓవరాల్‌గా ఇండియా పైచేయి సాధించింది. ఇంగ్లీషు గడ్డపై అశ్విన్ అద్భుత ప్రదర్శనకు తోడు పేసర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 285/9కే పరిమితమైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌ను కెప్టెన్ రూట్ (80; 156 బంతుల్లో 9 ఫోర్లు), బెయిర్ స్టో (70; 88 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు.