
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది. చెత్త బౌలింగ్‌తో చిత్తయింది. టీమిండియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా కొట్టి అవతల పడేసిందంటే- బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. జోస్ బట్లర్- 80, అలెక్స్ హేల్స్- 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
టీమిండియా బౌలింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిదన్నట్టు తయారైంది. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా- ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్ల కౌంటర్ అటాక్‌కు వారి వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఒక్కొక్కరు భారీగా పరుగులను సమర్పించుకున్నారు. అక్షర్ పటేల్ మాత్రమే తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసుకోగలిగాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్.. అటాకింగ్ బ్యాటింగ్‌ను ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. టీమిండియా బౌలర్లకు ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఒకవైపు ధాటిగా ఆడుతూనే మరోవైపు ఒళ్లు జాగ్రత్త పెట్టుకున్నారు. చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌ను గెలవడం ఎంత అవసరమో వారికి బాగా తెలుసు కాబట్టే అటు బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే తప్పులు చేయలేదు.
ప్రత్యేకించి- రవిచంద్రన్ అశ్విన్న బౌలింగ్‌లో ఇది ప్రస్ఫూటంగా కనిపించింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడంలో ఎక్స్‌పర్ట్.. అశ్విన్. ఇదివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఈ విధానం ద్వారా అవుట్ అయ్యాడు జోస్ బట్లర్. ఆ అనుభవం ఉండటం వల్ల రవి అశ్విన్ బౌలింగ్‌లో క్రీజ్‌ను దాటి బయటికి రావడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. కుదురుగా క్రీజ్‌లో కనిపించారు వారిద్దరూ.