
దుబాయ్: ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 సెమీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ మెగా టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో పిక్క గాయంతో బాధపడిన రాయ్.. ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడికి గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. రాయ్ ప్రపంచకప్‌లో అందుబాటులో ఉండబోడని ఇంగ్లండ్ జట్టు తాజాగా ప్రకటించింది. అతని స్థానంలో జేమ్స్ విన్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఇంగ్లండ్ జట్టు మొదటి సెమీ ఫైన్‌లో న్యూజిల్యాండ్‌తో తలపడనుంది. అబుదాబి వేదికగా బుధవారం (నవంబర్ 10) రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనింగ్ బాధ్యతలు ఎవరు మోస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అద్భుత ఫామ్‌లో ఉన్న జొస్ బట్లర్‌తో కలిసి జేమ్స్ విన్స్ ఓపెనింగ్ చేయించాలా? లేక లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టోలలో ఒకరిని ఓపెనింగ్ చేయడానికి పంపాలా? అని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. డేవిడ్ మలన్, మొయిన్ అలీ కూడా రేసులో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ కోసం రిజర్వ్ ఆటగాడిగా విన్స్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే.
వ్యక్తిగత కారణాలతో బెన్ స్టోక్స్, గాయంతో జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన ఇంగ్లండ్.. టీ20 ప్రపంచకప్ 2021 ఆరంభానికి ముందు సామ్ కరన్ సేవలను కూడా ఇంగ్లండ్ కోల్పోయింది. అయినా కూడా ఇంగ్లండ్ జట్టు సూపర్ 12 దశలో అద్భుత విజయాలు అందుకుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని 8 పాయింట్లతో గ్రూప్ 1 నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక కీలక సెమీస్‌కు ముందు మరో షాక్ తగిలింది. అయినా కూడా ఇంగ్లండ్ జట్టు పటిష్టంగానే ఉంది.
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జాసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జేమ్స్ విన్స్.
రిజర్వ్ ఆటగాళ్లు: లియామ్ డాసన్, రీస్ టోప్లే.