న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లాండ్ జట్టు పైన ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంతలా అంటే.. ఇంగ్లీష్ టీం ప్రస్తుతం స్వదేశానికి వెళ్లేందుకు సాహసం చేయలేనంత. ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్ అయిదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కదాంట్లోనే విజయం సాధించింది.
సోమవారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో గెలుస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, పెద్ద పసికూనగా భావించే ఆ జట్టు చేతిలోను ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వదేశానికి తమ జట్టు తిరిగి వస్తే అంతు చూస్తామన్నంత ఆగ్రహంలో అభిమానులు ఉన్నారట.
దీంతో స్వదేశానికి వెళ్లేందుకు ఇంగ్లాండ్ జట్టు జంకుతోంది. ప్రపంచ కప్ నుండి అనూహ్యంగా ఇంటికి దారి పట్టడాన్ని జట్టు, సెలక్టర్లు, అభిమానులు ఎవరు జీర్ణించుకోవడం లేదు. వారు ఇంకా తేరుకోవడం లేదు. అభిమానుల ఆగ్రహం నేపథ్యంలో జట్టుకు అదనపు సెక్యూరిటీ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, ప్రపంచ కప్ అయిపోయే వరకు ఆస్ట్రేలియాలోనే ఉండాలని ఇంగ్లాండ్ టీం భావిస్తోందట. అప్పటి వరకు అభిమానుల ఆగ్రహం కొంత తగ్గుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు.
భారీ మార్పులకు అవకాశం
మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో భారీ మార్పులకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సగం మంది ఆటగాళ్లకు ఉద్వాసన పలకవచ్చునని చెబుతున్నారు. కౌంటీల్లో సత్తా చాటుతున్న కుర్రాళ్లను జట్టులోకి తీసుకు వచ్చే యోచన చేస్తున్నారు. చాలామంది సీనియర్లకు మేనేజ్‌మెంట్ షాకిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.