ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టెస్టులతో పాటు వన్డే, టీ20 ఫార్మాట్‌లోనూ భారత్ టాప్‌లో ఉంది. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో ముగించడంతో టీమిండియా ఫస్ట్ ర్యాంక్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆస్ట్రేలియా మొదటి స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌పై అయిదు టెస్టుల సిరీస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకోవడంతో తిరిగి టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది .ఆ తర్వాత వరుసగా వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల టెస్టుల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుంది. 122 రేటింగ్ పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో 117 పాయింట్లు ఉన్నాయి.

ప్రస్తుతం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో ఆసీస్ విజయం సాధించినప్పటికీ భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 121 పాయింట్లతో టాప్‌లో ఉంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో 266 పాయింట్లతో టీమిండియా ఫస్ట్ ర్యాంక్‌లో, 256 పాయింట్లతో ఇంగ్లండ్ సెకండ్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.
అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ టేబుల్‌లోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 68.51 గెలుపు శాతంతో టాప్‌లో ఉంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరు విజయాలు, రెండు ఓటములు సాధించింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగించి 74 పాయింట్లు సాధించింది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 60 విజయశాతంతో 36 పాయింట్లు సాధించింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ మూడు విజయాలతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.