
పూణే: టెస్టులు, టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చలాయించిన టీమిండియా.. ఇక ఆ జట్టుతో వన్డే సమరానికి సిద్ధమైంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో రెండు జట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సామ్ బిల్లింగ్స్, టామ్ కరన్, మొయిన్ అలీ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ ఆరంగేట్రం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు దక్కింది. అయితే సూర్యకు మాత్రం నిరాశే ఎదురైంది.
పూణే పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. ఇక్కడ ఇప్పటివరకు నాలుగు వన్డేలు మాత్రమే జరగ్గా.. మూడుసార్లు మొదట బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్ 300 దాటింది. ఇరు జట్లూ బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మంగళవారం కూడా 300 పైచిలుకు స్కోరు నమోదవడం లాంఛనమే అని భావిస్తున్నారు. 2017లో భారత్, ఇంగ్లండ్ జట్లు ఇక్కడ వన్డే మ్యాచ్ ఆడగా.. భారత్ ఏకంగా 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.
టెస్టు సిరీస్‌లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన ఇంగ్లండ్.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం సత్తాచాటింది. తొలి టీ20, మూడో టీ20 గెలిచి.. ఒకదశలో సిరీస్ చేజిక్కించుకునేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచులలో ఒత్తిడిని జయించడంలో విఫలమైన మోర్గాన్ సేన పరాజయం వైపు నిలిచింది. అయితే ఆ ఓటములను పక్కనపెట్టి వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ తాజాగా సిద్ధమవుతున్నది. దాదాపు టీ20ల్లో ఆడిన ఆటగాళ్లే వన్డే సిరీస్ ఆడనున్నారు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, ఆదిల్ రషీద్, టామ్ కరన్, మార్క్ వుడ్.