వన్డే ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పతనం మొదలైందా? బజ్ బాల్ క్రికెట్ సిద్ధాంతమే వారి కొంపముంచిందా? అతిగా ఆల్ రౌండర్లు, విధ్వంసకర బ్యాటర్లను వెతుకుతూ.. నష్టాల్ని కొని తెచ్చుకుందా? వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టు గత ప్రదర్శనలను చూస్తే అవుననే అనిపిస్తుంది!!
ఇటీవల జరిగిన వన్డే వరల్ట్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగి పేలవ ప్రదర్శన చేసింది. నాకౌట్స్ కు కూడా క్వాలిఫై కాలేదు. ఆఖరికి టేబుల్ లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. పసికూన జట్ల చేతిలో ఓడి విమర్శల పాలైంది.

అయితే మెగాటోర్నీ అనంతరం ఇంగ్లాండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. వరల్డ్ కప్ చేదు గుర్తులను చెరిపి వన్డే సిరీస్ సాధించాలని కసిగా బరిలోకి దిగింది. కానీ సిరీస్ ను 1-2 తేడాతో కోల్పోయింది. అద్భుత ప్రదర్శన చేసిన వెస్టిండీస్.. కరేబియన్ దీవుల్లో ఇంగ్లాండ్ ను 25 ఏళ్ల తర్వాత ఓడించి చారిత్రక విజయాన్ని అందుకుంది.
ఇంగ్లాండ్ చివరి 12 వన్డేల్లో నాలుగే విజయాలు సాధించింది. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లపై క్లాస్ ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్లు జట్టులో ఎక్కువగా లేరు. అది ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా తగిలింది. మెగాటోర్నీలో జో రూట్, బెన్ స్టోక్స్ నిరాశపరిచారు. జట్టులోని మిగిలిన హిట్లర్లు బ్యాట్ ను కాసేపు ఊపి తక్కువ స్కోరుకే వెనుదిరగడం వారి ఓటములకు ప్రధాన కారణమయ్యాయి.

క్వాలిటీ బ్యాటర్, బౌలర్ కంటే ఆల్ రౌండర్లు, భారీ హిట్టర్లను వెతకడంలో సెలక్టర్లు బిజీబిజీగా అయిపోవడం ఇంగ్లాండ్ పతనానికి ఓ కారణంగా మారింది. కఠిన పిచ్ లపై నిలవాలంటే వారికి కష్టంగా మారింది. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ లోనూ అదే పరిస్థితి ఎదురైంది. మూడో వన్డేలో 206 పరుగులకే ఆలౌటైంది. అందులో కూడా 62 పరుగులు చివరి నలుగురు బ్యాటర్లే సాధించడం గమనార్హం. అయితే టీ20 ఫార్మాట్ లో వారి దూకుడైన ఆట తీరు మంచి ఫలితాలనే ఇస్తుంది.