'ది సన్' డైలీపై కోపం: ఈసీబీతో పాటు మొత్తం దేశం బెన్ స్టోక్స్‌కు మద్దతు

హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు బాసటగా నిలిచింది. రెండు రోజుల క్రితం తన కుటుంబానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని 'ది సన్' డైలీపై ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, తన జీవితంలో ఎంతో విషాదాన్ని మిగిల్చిన ఆ ఘటనను మరోసారి తెరపైకి తీసుకురావడంపై బెన్ స్టోక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'ది సన్' పత్రిక చేసిన విషయంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు బెన్ స్టోక్స్‌కు బాసటగా నిలవగా... తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సైతం అతడికి మద్దతుగా నిలిచింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హార్రిసన్ మాట్లాడుతూ "స్టోక్స్ గత జీవితానికి సంబంధించిన విషాద సంఘటనలను బహిర్గతం చేయడంలో తీసుకున్న చర్యలపై తాము అసహ్యించుకుంటున్నాం" అని అన్నాడు.
"వార్తాపత్రికలను అమ్ముకునేందుకు లేదా క్లిక్‌లను పెంచుకునేందుకు ఈ తరహా పరిణామాలను పాల్పడటం చాలా బాధకరం. లార్డ్స్, హెడెంగ్లే టెస్టుల్లో బెన్ స్టోక్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. దేశం మొత్తం అతని వెనుక మద్దతుగా నిలుస్తుందని మాకు తెలుసు" అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హార్రిసన్ చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగింది?
బెన్ స్టోక్స్ జన్మించడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బెన్ స్టోక్స్ సోదరి, సోదరుడుని అతడి తల్లి మాజీ ప్రియుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ వార్తను మూడు దశాబ్దాల తర్వాత హైలెట్ చేస్తూ ది సన్ పత్రిక వార్తకథనాన్ని ప్రచురించింది. బెన్ స్టోక్స్ కుటుంబానికి సంబంధించిన ఈ సున్నితమైన అంశాన్ని ఇప్పుడు ప్రచురించడంపై స్టోక్స్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నేను చాలా బాధపడ్డా
"ఈ రోజు సన్ పత్రికలో వచ్చిన వార్తను చూసి నేను చాలా బాధపడ్డా. నా వ్యక్తిగత, బాధకరమైన విషయాన్ని బహిర్గతం చేశారు. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మమ్మల్ని ఆవేదనకు గురిచేశారు. జర్నలిజం విలువలను ఏ మాత్రం పట్టించుకోకుండా ‘ది సన్' వ్యవహరించింది" అంటూ ట్వీట్ చేశాడు.
మా ఇంటికి వెళ్లి
"మూడు రోజుల క్రితం రిపోర్టర్లు మా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో ఈ విషయం గురించి గుచ్చిగుచ్చి అడిగిన తీరు నన్నెంతో బాధకు గురి చేసింది. మా కుటుంబానికి చెందిన విషాదకర విషయాన్ని అప్పటి నుంచి మా గుండెల్లోనే దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాం. ఇప్పుడు ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిపి ‘ది సన్' ఏదో సాధించిందని సంతోష పడుతుంది. మీ కుటుంబానికి చెందిన సున్నితమైన, వ్యక్తిగత విషయాన్ని ఫ్రంట్ పేజీలో ప్రచురించగలరా?" అని ట్విట్టర్‌లో స్టోక్స్ భావోద్వేగ పోస్టు పెట్టాడు.

సన్ పత్రిక వాదన మరోలా
ఇదిలా ఉంటే 'ది సన్' వార్తాపత్రిక స్పందన మాత్రం మరోలా ఉంది. బెన్ స్టోక్స్ కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఫోటోలు, సహకారంతోనే ఈ వార్తా కథనాన్ని ప్రచురించామని ది సన్ పేర్కొంది. కాగా.. ఇటీవలే ముగిసిన ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో బెన్ స్టోక్స్ 55.12 యావరేజితో మొత్తం 441 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

2-2తో యాషెస్ సిరిస్ సమం
దీనికి తోడు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. గత ఆదివారం ఓవల్ వేదికగా ముగిసిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ 2-2తో సమం అయింది. 47 ఏళ్ల తర్వాత యాషెస్ సిరీస్ డ్రా కావడం ఇదే తొలిసారి. సిరీస్ డ్రా అయినప్పటికీ, ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. గత యాషెస్ సిరిస్‌లో ఆసీస్ గెలిచినందున ట్రోఫీని వారి వద్దే ఉండనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications