T20 World Cup: ఆ ఇండియా స్టార్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’.. తేల్చిచెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్!

టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు లభిస్తుంది. ఈసారి ఈ అవార్డు కోసం మొత్తం 9 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వీరిలో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనలిస్టు ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ తనైతే ఈ అవార్డు ఎవరికిస్తానో వెల్లడించాడు.

బట్లర్ దృష్టిలో అతనికే అవార్డు
'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' రేసులో ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ కూడా ఉన్నాడు. కానీ ఈ అవార్డు టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కే దక్కాలని అన్నాడు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన సూర్య.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అతను జింబాబ్వేపై ఆడిన ఇన్నింగ్స్ ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ట్రోలర్స్ విమర్శలు..
సూర్యకుమార్‌కు ఈ అవార్డు ఇవ్వాలని బట్లర్ అనడంతో నెట్టింట ట్రోలర్లు రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్‌తో ఆడిన సెమీఫైనల్‌లో సూర్యకుమార్ 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. అందుకే బట్లర్ కూడా ఈ అవార్డు సూర్యకు ఇవ్వమంటున్నాడని ట్రోలర్స్ ఎగతాళి చేస్తున్నారు. అలాగే జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి పిల్ల జట్ల మీదనే సూర్య ప్రతాపం చూపించాడని, సౌతాఫ్రికాపై ఆడినా జట్టు ఓడిపయిందని అంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన కీలకమైన మ్యాచుల్లో సూర్యకుమార్ చేతులెత్తేశాడని విమర్శిస్తున్నారు.

రేసులో ఎవరున్నారంటే?
ప్రస్తుతం ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కోసం మొత్తం 9 మంది ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. వీరిలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. పాకిస్తాన్ నుంచి షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రిదీ ఈ రేసులో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా ముగ్గురు ఆటగాళ్లు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఇంగ్లిష్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్‌తోపాటు ఆ జట్టు బౌలింగ్ భారాన్ని మోసిన శామ్ కర్రాన్ కూడా పోటీలో ఉన్నారు. వీళ్లు కాకుండా జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, శ్రీలంక టాప్ స్పిన్నర్ వానిందు హసరంగ కూడా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' కోసం పోటీ పడుతున్నారు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హసరంగనే కావడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications