లండన్: ఇంగ్లాండ్‌కు బిగ్ షాక్. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడటానికి సిద్ధపడుతోన్న ఆ జట్టు కేప్టెన్ జో రూట్ గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా అతని చేతికి గాయమైంది. ఇంకొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ను ఆడాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో అతను గాయపడటం ఇంగ్లాండ్ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గాయపడ్డ వెంటనే నెట్స్ నుంచి వెళ్లిపోయాడు జో రూట్.
కొంత విరామం తరువాత మళ్లీ గ్రౌండ్లోకి అడుగు పెట్టాడు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఇప్పటికే తొలి టెస్ట్‌కు జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, జేసన్ రాయ్ దూరం అయ్యారు. ఈ పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన జో రూట్ ఖచ్చితంగా ఆడి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది ఇంగ్లాండ్ టీమ్.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ సంధించిన బంతి నేరుగా అతని కుడి చేతిని తాకింది. కొద్దిసేపు బాధతో విలవిల్లాడిపోయాడు జో. ఆ వెంటనే అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ సహకారంతో గ్రౌండ్‌ను వీడాడు. కొద్దిసేపటి తరువాత గ్రౌండ్లో అడుగు పెట్టినప్పటికీ- ప్రాక్టీస్ సెషన్స్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు. ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లోనూ పార్టిసిపేట్ చేయలేదు. డాగ్ థ్రోవర్ ట్రైనింగ్ డివైజ్ ద్వారా కోచ్ సిల్వర్‌వుడ్.. జో రూట్ మీదికి ఈ బంతిని సంధించినట్లు తేలింది.
ఆ తరువాతి ప్రాక్టీస్ సెషన్స్‌కు కూడా జో రూట్ దూరంగా ఉంటాడని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే జో రూట్‌ను ప్రాక్టీస్ దూరంగా ఉంచినట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాక్టీస్ తరువాత నేరుగా న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో తొలి టెస్ట్ ఆడాల్సి ఉన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రాక్టీస్ సందర్భంగా మరింత ఇబ్బందులకు గురి కాకూడదనే కారణంతోనే అతన్ని గ్రౌండ్‌కు దూరంగా ఉంచినట్లు తెలిపింది. తొలి టెస్ట్ మ్యాచ్‌కు గనక జో రూట్ ఆడలేకపోతే.. సామ్ బిల్లింగ్స్ అతని స్థానాన్ని భర్తీ చేయొచ్చని తెలుస్తోంది.